మంచుకొండల్లో మృత్యు ఘంటికలు.. ఎవరెస్టులో 8కి చేరిన మృతుల సంఖ్య

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. పర్వతారోహణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు. బాన్షీలాల్‌ (46) అనే భారతీయ పర్వతారోహకుడు గతవారం ఎవరెస్టు మార్గంలో చిక్కుకుపోయాడు. అతన్ని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. కాఠ్‌మాండూలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు నేపాల్‌ పర్యటక శాఖ పేర్కొంది.

Spread the love