సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

ఉద్యోగులకు సూచనలు జారీ చేసిన సీఎస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో జూన్‌ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచనలు జారీ చేశారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు జెండా ఎగురవేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులందరూ తమ విభాగాల అధిపతులు, సిబ్బందితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. హెచ్‌ఓడీలకు బీ3 బ్లాక్‌ నుంచి, సీనియర్‌ అధికారులు బీ4 బ్లాక్‌ నుంచి ప్రవేశానికి అనుమతిస్తారు. వివిధ విభాగాల సిబ్బంది కోసం ఆయా హెచ్‌ఓడీల సంతకం, స్టాంప్‌తో కూడిన ఆహ్వానపత్రాలను అందజేయాల్సి ఉంటుంది. తాము పని చేస్తున్న డిపార్ట్‌మెంట్‌ ఐడీ కార్డుతో పాటు ఆ రోజు ఆహ్వానపత్రాన్ని తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ శుక్రవారం ఉదయం 9 గంటలకల్లా సచివాలయానికి చేరుకుని 9.30 గంటల వరకు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాలని సీఎస్‌ ఈ సందర్భంగా సూచించారు.

Spread the love