సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే ‘మంచినీళ్ల పండుగ’ కోసం ఏర్పాట్లు ఘనంగా చేయాలని సూచించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్.ఈలతో దశాబ్ది ఉత్సవాలపై స్మితా సభర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల కోసం హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు ఇన్‌ఛార్జిలను స్మితా సభర్వాల్ నియమించారు. జూన్ 18 నాడు మిషన్ భగీరథ నీటిశుద్ది కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహించాలని చెప్పారు. నాడు మంచినీళ్ల కోసం పడ్డ కష్టాలను, నేడు మిషన్ భగీరథతో అవుతున్న తాగునీటి సరఫరాను గ్రామస్థులకు వివరించాలని కోరారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులను వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(డబ్లూటీపీ)కు తీసుకుపోయి నీటిశుద్ది ప్రక్రియను చూపించాలని చెప్పారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని గ్రామాలకు సరఫరా అవుతున్నాయన్న అంశాలను వారికి వివరించాలని ఆదేశించారు. ఈ సంబరాల్లో గ్రామస్థులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. ఇక జూన్13వ తేదీన నిర్వహించే మహిళా సంక్షేమ దినోత్సవం సంబరాల్లో మిషన్ భగీరథ మహిళా ఇంజినీర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. భగీరథ ప్రధాన కార్యాలయంతోపాటు ఎస్.ఈ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని వివరించారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించాలన్నారు. ఈ సమావేశంలో ఈఎన్సీ జి కపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్‌తో పాటు చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈలు పాల్గొన్నారు.