‘దశాబ్ది’ పాలన

నేటికీ మూఢవిశ్వాసాలు, ఫ్యూడల్‌ అవశేషాలు ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తుండటం ఆందోళనకరం. ఇక్కడ సర్కారుతో పాటు అందరూ ప్రశ్నించుకోవాల్సిందే. నిరుద్యోగంతో యువతలో అసంతృత్తి పెరుగుతున్నది. ఉద్యోగాలిచ్చి న్యాయం చేసే నియామక ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. మతోన్మాదం, కార్పొరేటీకరణ రాష్ట్రాభివృద్ధికి ప్రధాన ఆటంకం. మత పరమైన విభజన రాజకీయాలను ఆదిలోనే నిలువరించకపోతే సాధించింది కూడా మిగలదు. ”నున్నగున్న రోడ్డుపక్కన మోదుగుపూలు మెరుస్తున్నయి.. ఊరి చెరువు నీళ్లల్ల కలువలు కాంతులీనుతున్నయి.. చెక్‌డ్యామ్‌ల చేపలు ఎగిరెగిరి మురుస్తున్నయి.. పొలంకాడి బోరుబాయి జోరుగ నీళ్లుపోస్తున్నది..ఎడ్ల బండ్లన్నీ వడ్ల బండ్లవుతున్నరు”
ఇలా సర్కారు పదేండ్ల తెలంగాణకు అర్థం చెప్పుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమంలో అప్పుడెంట్లుండే.. ఇప్పుడేట్లయింది అంటూ మురిపంగ రాష్ట్రమంతా సంబరాలకు పిలునిచ్చింది. మూడు వారాల పండుగలో నిధులిచ్చి మరీ ప్రజలను భాగస్వాములను చేస్తున్నది. నిజమే..ఏ ప్రభుత్వమైనా తాను చేసిన కష్టం, ప్రజలకు చేరుతున్న విధం, జనం అనుభవిస్తున్న ఫలితాలను ప్రజలకు చెప్పుకోవడం సహజమే. పదేండ్లల్లో వందేండ్ల అభివృద్ధికి బాట వేశామని గులాబీ సర్కారు భావన. అవునా… ఇది నిజమేనా!? అంటూ ప్రతిపక్షాల ప్రశ్న. అభివృద్ధి కోసం నిరంతరం ఆరాటపడుతున్నామని సర్కారంటే, కాదు ప్రజాస్వామ్యానికే తూట్లు పొడిచిందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాల మధ్య ప్రచ్చన్నయుద్ధం ఇలా నడుస్తూనే ఉంది. ఒకవైపు ప్రభుత్వం తాము సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటుండగా, మరోవైపు ప్రతిపక్షాలు సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఎవరేది చెప్పినా అంతిమ తీర్పును ఇచ్చేది రూ.5 లక్షల కోట్ల అప్పులను మోస్తున్న నాలుగు కోట్ల మంది సామాన్య జనమే.
రాష్ట్రం సమగ్రాభివృద్ధి వైపు వెళుతున్నదా… లేదా? అనేది గమనించాలి. పథకాలన్నీ ఒక తరగతికో, వర్గానికో కాకుండా సామాన్యులకు చేరుతున్నాయో… లేదో? కూడా పరిశీలించుకోవాలి. రైతుబంధు తరహాలోనే వ్యవసాయ కార్మికులు, సెంటుభూమి లేనివారికి ‘కూలిబంధు’కు శ్రీకారం చుట్టాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది. రూ.1.5 లక్షల కోట్లతో దాదాపు 80 లక్షల ఎకరాల్లోకి సాగునీటిని పరవళ్లు తొక్కించిన సర్కారు దళితబంధునూ అమలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు గంటల కరెంటుకే మొహం వాచేలా ఎదురుచూసిన దినాలను మరిపించేలా, 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది. పింఛన్లు, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా ఉంటేనే ప్రజల మన్ననలు పొందుతాయి. అది ఇంకా ఈ ప్రభుత్వం సాధించాల్సి ఉంది. ప్రభుత్వం పెట్టే ఖర్చులో నిరుపేదల భాగం పెంచాల్సిన బాధ్యతా ఉంది. మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులను పసిగట్టి ఎదుర్కోవాలంటే ప్రజల మద్దతు కూడగట్టుకోవాల్సిందే. కార్మికులు, భూనిర్వాసితులు, పోడురైతులు, స్కీం వర్కర్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాల్లేని ప్రజలకు న్యాయం చేసేలా దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సర్కారు, తన విధానాన్ని సమీక్షించుకోవాలి. ప్రభుత్వం ప్రతిపక్షాలు, పౌరసమాజంతో ఎప్పటికప్పుడు మమేకమై నిర్ణయాలు చేస్తే, అద్భుతమైన ఫలితాలు సాధిóంచొచ్చు. తొమ్మిదేండ్లు పూర్తయి దశాబ్ది సంవత్సరంలోకి అడుగిడుతున్న కేసీఆర్‌ సర్కారు, గతాన్ని నెమరేసుకోవాలి. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం ముందుంది. తలసరి ఆదాయంతోపాటు జీఎస్‌డీపీలోనూ అగ్రస్థానమే. ఇది సంతోషించదగ్గ విషయమే కానీ, అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తేవడం. ఆరోగ్యం, విద్య, సామాజిక, సాంఘీక అంశాల్లో మెరుగు చేయడం. గ్రామాల్లో మౌలిక వసతులు పెంచడం. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ కుతంత్రాలను అడ్డుకొని సామరస్యాన్ని కాపాడటం. విద్యావైద్యంలో వెనుకబాటుతనానికి చెల్లుచీటి పలకడం. అప్పుడే సర్కారీ మ్యానిఫెస్టోకు జవజీవాలు ఒనగూరే అవకాశాలు మెండు.
నేటికీ మూఢవిశ్వాసాలు, ఫ్యూడల్‌ అవశేషాలు ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తుండటం ఆందోళనకరం. ఇక్కడ సర్కారుతో పాటు అందరూ ప్రశ్నించుకోవాల్సిందే. నిరుద్యోగంతో యువతలో అసంతృప్తి పెరుగుతున్నది. ఉద్యోగాలిచ్చి న్యాయం చేసే నియామక ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. మతోన్మాదం, కార్పొరేటీకరణ రాష్ట్రాభివృద్ధికి ప్రధాన ఆటంకం. మతపరమైన విభజన రాజకీయాలను ఆదిలోనే నిలువరించకపోతే సాధించింది కూడా మిగలదు. ప్రజలు, కుటుంబాలు, భవిష్యత్‌ తరానికి చిహ్నాలైన పిల్లల అభివృద్ధి, విద్యా, వైద్యం మొదలైనవి బలోపేతంచేస్తేనే బతుకుదెరువు. ఈ అప్రమత్తత ప్రజల్లోనూ ఉండాలి. అందరితో చర్చించి ముందుకెళ్తే ప్రజాసమస్యల పరిష్కారం మరింత సులువవుతుంది. వనరుల వినియోగం పారదర్శకంగా సాగుతుంది. అప్పుడే ‘తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది’ నినాదానికి సార్థకత !

 

Spread the love