– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి
– మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన
నవతెలంగాణ-నస్పూర్
మంచిర్యాల జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజులుగా విషజ్వరాలు, డెంగ్యూతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వ్యవహరిస్తోందని విమర్శించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. ప్రజలు విషజ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం సమస్యనే లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఎనిమిది మందికిపైగా చనిపోయారని తెలిపారు. గ్రామాలు, వార్డులు జ్వర పీడితులతో అల్లాడుతున్నాయని, ప్రభుత్వ వైద్యం అందక రోగులు అప్పులు చేసి ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని చెప్పారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్యశాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. తక్షణమే మంచిర్యాల జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని మండలాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి సబ్‌సెంటర్ వరకు 24గంటలు వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్య క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, నాయకులు ప్రేమ్ కుమార్, మహేష్, కుమార స్వామి, మహేందర్, శ్రీకాంత్, ఏల్పుల శంకర్, భూదేవి, రేణుక, రమ్య, సమ్మక్క, శ్రీనివాస్, కుమార్, శివ పాల్గొన్నారు.