– మీరే స్వయంగా వచ్చి పరిశీలించండి
– భారీ వర్షాలు, వరదలపై ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
– మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
– చనిపోయిన పాడి పశువులకు రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.5 వేల పరిహారం
– తక్షణ సాయం కోసం ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం కలెక్టర్లకు రూ.5 కోట్లు విడుదల
– ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో పోలీసు సిబ్బందికి శిక్షణ టీజీడీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేస్తాం : సమీక్షలో సీఎం నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని పరిశీలించేందుకు స్వయంగా రాష్ట్రానికి విచ్చేయాలంటూ ఆయన్ను కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీఎం రేవంత్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అతి తక్కువ సమయంలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురవడానికిగల కారణాలు, రాగల రెండు మూడు రోజుల వాతావరణ పరిస్థితుల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కవగా ఈ యేడాది వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖాధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గతంలో ఏ అయిదేండ్లకో, పదేండ్లకో ఇలాంటి కుంభవృష్టి కురిసేదని వారు తెలిపారు. ఇటీవల తరచూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఈ విషయమై మరింత లోతైన అధ్యయనాలు కొనసాగుతున్నాయని వివరించారు. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో అన్ని విభాగల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు. చెరువులు, కల్వర్టులు, లోలెవల్ కాజ్‌వేలు, ఇతర ప్రదేశాల్లో వివిధ శాఖల అధికారులతో పర్యవేక్షణ చేయించాలని సీఎం ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ప్రతి మూడు గంటలకో బులెటిన్ విడుదల చేయాలని ఆయన సూచించారు.
వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చనిపోయిన పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకు చెల్లించే పరిహారాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో రూ.లక్షన్నరకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు తెలిపారు. అయితే నాలుగు లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వార్తలొస్తున్నాయనీ, తక్షణమే రంగంలోకి దిగి ఆయా వివరాలను సేకరించాలని సీఎం ఆదేశించారు. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారాన్ని వెంటనే విడుదల చేశామనీ, ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సంబంధిత వివరాలను సమగ్రంగా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వ బృందాలు సైతం తక్షణమే పంట నష్ట పరిశీలనకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని ఎనిమిది బెటాలియన్లలో మూడో వంతు యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణివ్వాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి తక్షణ సాయం ఎందుకు అందడం లేదని ఆయన ప్రశ్నించారు. మనం (ప్రభుత్వం) పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల దగ్గర ఉన్న బలగాలను పంపుతారనీ, ఇందుకు సమయం పడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. స్పందించిన రేవంత్… మన బెటాలియన్లలోని యువ పోలీసులకు ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణనివ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఎక్విప్‌మెంట్ సమస్యగా ఉంటుందని అధికారులు తెలపగా.. ఎంత ఖర్చయినా ఫర్వాలేదనీ, వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. ఒడిశా, గుజరాత్‌లో అలా శిక్షణనిచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నారని అధికారులు తెలపగా, అవసరమైతే అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో అనుభవం ఉన్నవారితో శిక్షణ ఇప్పించాలని సీఎం సూచించారు. దానికోసం ఒక మాన్యువల్‌ను రూపొందించాలని కోరారు. ప్రతీ సీజన్ ముందు శిక్షణనిప్పించిన సిబ్బందితో రిహార్సల్స్ చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ, కమిషనరేట్ల పరిధిలో…
వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు ఇతర కార్పొరేషన్లు, కమిషనరేట్ల పరిధిలో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడానికి వీల్లేదని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విద్యుత్, ట్రాఫిక్, తాగు నీరు, శానిటేషన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించాలనీ, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని సూచించారు. వర్షాలు, వరదలతో నిత్యం పనికి వెళ్లే కూలీలు బయటకు వెళ్లలేక, ఇంటి దగ్గరే ఉండిపోతారని రేవంత్ పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.
విద్యుత్ సిబ్బందికి అభినందనలు…
భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో 25 పెద్ద పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి వారిని అభినందించారు. అదే తరహాలో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలనీ, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా ఎవరూ వాటిని దాటేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారుడు వేం నరేంద్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తోపాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.