– సీపీఐ(ఎం)ను గెలిపించండి
– భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎండి.జహంగీర్
నవతెలగాణ-చేర్యాల/ఆలేరుటౌన్
పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద, అవకాశవాద పార్టీలను ఓడించి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం)ను గెలిపించాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎండి.జహంగీర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణం, చేర్యాల రూరల్, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల సీపీఐ(ఎం) కార్యకర్తల సమావేశం చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో జహంగీర్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న మతోన్మాద రాజకీయాలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. దేశం వెనుకబడటానికి కారణమైన కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పది సంవత్సరాలుగా నియంతృత్వంగా వ్యవహరించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విస్మరించారన్నారు. ఎలాంటి చరిత్ర లేని వ్యక్తులు అభ్యర్థులుగా పోటీకొస్తున్నారని తెలిపారు.
నీతి, నిజాయితీ పోరాటాల వారసత్వం కలిగిన సీపీఐ(ఎం) అభ్యర్థిగా భువనగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేస్టున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద, అవకాశవాద రాజకీయ పార్టీల అభ్యర్థులను తిరస్కరించాలని, పదవుల కోసం అనైతికంగా వ్యవహరిస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసం పనిచేస్తున్న తనను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్.అడివయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, కాముని గోపాలస్వామి, శెట్టిపల్లి సత్తిరెడ్డి, సందబోయిన ఎల్లయ్య, గోడ్డుబర్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో ఎండీ.జహంగీర్
నిత్యం పేదలు, కార్మికులు, కర్షకుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తనకు ఓటేసి గెలిపించాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్ కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలోనే తమ పార్టీ పోటీ చేస్తుందని, నిరంతరం పేదల, కార్మికుల, కర్షకుల కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న తనకు ఓటు వేసి గెెలిపించాలని ముస్లిములను కోరారు.తన కుటుంబం చిన్న హోటల్ నిర్వహణతో జీవనం సాగిస్తుండగా.. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తాను సీపీఐ(ఎం)లో చేరి 35 ఏండ్లుగా అనేక పోరాటాలలో భాగస్వామ్యం అయ్యానని చెప్పారు. నంతరం మాజిత్ కమిటీ సభ్యులు జహంగీర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మంగ నరసింహులు, మండల కార్యదర్శి దూపటీ వెంకటేష్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ముస్లింలు ఎండి బద్రుద్దీన్, ఎండీ. రఫీ, ఎండీ.ఖలీల్, ఎండీ.జైనుద్దీన్, అఖిల్, ఎండీ.సలీం, ఎండి అప్సర్, ఎండీ.జహంగీర్, ఎండీ.మతిన్, ఎండీ.అజర్ పాల్గొన్నారు.