– జనాల కోసం పనిచేసే నాయకున్ని గెలిపించండి
– సీపీఐ(ఎం) పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఈనెల 30న జరిగే పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో జెండాలు మార్చే నాయకులను ఓడించాలని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని చింతపల్లి, శ్రీరామ్ నగర్, కొండాపురం, సీతారాంపురం, అరేంపుల, బారుగూడెం, శ్రీ సిటీ, గొల్లగూడెం, నందనవనం, రుద్ర టౌన్షిప్ గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పాలేరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లని, డబ్బులు సంచులతో ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు కొనేందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగురీతులో బుద్ధి చెప్పి నిజాయితీపరులకే పట్టం కట్టలన్నారు. 50 ఏళ్ల నుంచి పట్టిన జెండ వీడని చరిత్ర తనదన్నారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 2003లో 2600 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, గోదావరి జలాలను పాలేరులో కలిపి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మహాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశానని తెలిపారు. చాలా మంది నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని, తాను ఊపిరి ఉన్నంతవరకు ఎర్రజెండా నీడలోనే ఉంటానన్నారు. 2004 ఎన్నికలు పునరావృతం కావాలని, మరోసారి తనని గెలిపించి చట్టసభలకు పంపిస్తే ప్రజా గొంతుకునవుతానని తెలిపారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు పి.మోహన్ రావు, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, తోట పెద్ద వెంకట రెడ్డి, నందిగామ కృష్ణ, సూదగని యల్లయ్య, అరేంపుల ఉపేందర్, తమ్మినేని వీరభద్రయ్య, తమ్మినేని రంగారావు, దంద్యాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం: కేంద్ర, రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు ఏర్పడినా ఆ ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చట్టసభల్లో అమలు చేయించి ప్రజలకు అందించిన ఘనత సీపీఐ(ఎం)దే అని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండలంలోని సోలిపురం, మంగ్యా తండా, హాలవాత్ తండా, ముజాయితిపురం, ఏనుకుంట తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి నాయకుల చరిత్ర చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, డబ్బు సంచులతో వేలకోట్ల కాంట్రాక్టు, పనులు చేస్తూ అందులో అవినీతికి పాటుపడుతూ, సంపాదించిన అక్రమ సంపాదనతో ప్రజలను అంగడి సరుకులా కొనుగోలు చేసి ఓట్లు వేపిచ్చుకుందామని వారు భావిస్తున్నారని, అలాంటి డబ్బు రాజకీయాలు చేస్తున్న బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని, డబ్బు సంచులు పట్టుకొని ఏ పార్టీ అధికారంలోకొస్తే ఆ పార్టీలోకి, తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే, వేరే పార్టీ లోకి వెళ్లడం, ఇలా రాజకీయాలలో ఊసరవెల్లిగా రంగులు మారుతున్న నాయకులను ప్రజలు తిరస్కరించాలని, జన సమస్యల కోసం, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజాసంఘాల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థి అభ్యర్థినైనా నన్ను ప్రజలు ఆదరించి, ఆలోచించి ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, నాయకులు అంగిరేకుల నరసయ్య, బింగి రమేష్, వశపొంగు వీరన్న, మోటపోతుల శ్రీను, పల్లి రమేష్, అన్న బత్తుల సత్తిబాబు, కొత్తపల్లి వెంకన్న, ఎగినాటి వెంకట్రావు, కోట ఉపేందర్ రెడ్డి, కోట శ్రీనివాసరెడ్డి, దొండేటి నిర్మల్ రావు, నాగటి సురేష్, దాసరి మహేందర్. తుళ్లూరు నాగేశ్వరరావు పల్లి నాగన్న తదితరులు పాల్గొన్నారు.