– ప్రజాసమస్యలపై పోరాటం చేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి : పాలేరు అభ్యర్థి తమ్మినేని
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
”నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపించాలి.. స్వార్థం కోసం జెండాలు మార్చే వారికి ఓట్లేయొద్దు.. అలాంటి వారిని ఓడించాలి” అని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తమ్మినేని వీరభద్రం ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పేద ప్రజల తరుపున మాట్లాడే వారిని చట్టసభలకు పంపించాలని ఓటర్లను కోరారు. గతంలో తాను పార్లమెంట్, అసెంబ్లీ సభ్యుడిగా పని చేశానని చట్టసభల్లో పేదల గొంతును వినిపించేందుకే కృషి చేశానన్నారు. పాలేరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నోట్ల కట్టలతో ఓట్లు కొనేందుకు వస్తున్నారని, ఆ డబ్బులు తీసుకొని నిజాయితీపరులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. గుదిమళ్ళ గ్రామంలో పటేల్ నాసరయ్య, జాటోత్ నాగేశ్వరరావు, సుమారు 15 కుటుంబాల వారు సీపీఐ(ఎం)లో చేరారు. సీపీఐ(ఎం) పాలేరు ఇన్‌చార్జి బండి రమేష్, మండల కార్యదర్శి సండ్ర ప్రసాద్, మండల ఇన్‌చార్జి ఉరడి సుదర్శన్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
ఖమ్మం వన్ టౌన్ ప్రాంతాల్లో సీపీఐ(ఎం) ఖమ్మం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ విస్తృతంగా ప్రచారం చేశారు. సీపీఐ(ఎం) పోరాట ఫలితమే పాత బస్టాండ్ కొనసాగింపు అని, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన తనకు ఓటేయండని విజ్జప్తి చేశారు. తమ పార్టీ పాలనా కాలంలోనే ఖమ్మం సకల అభివృద్ధి చెందిందని చెప్పారు.
చింతకానిలో సీపీఐ(ఎం) మధిర అభ్యర్థి పాలడుగు భాస్కర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో అభ్యర్థి కారం పుల్లయ్య ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.