అభివృద్ధి పట్టని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించండి

– సీఐటియు జాతీయ కోశాధికారి మందడపు సాయిబాబు
– కార్మిక హక్కుల కోసం పోరాడుతా
– సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ – బోనకల్‌
ఎర్రజెండా ముద్దుబిడ్డ సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ను గెలిపించడం ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, నియోజకవర్గ అభివృద్ధి తిరిగి ప్రారంభం అవుతుందని సిఐటియు జాతీయ కోశాధికారి మందడపు సాయిబాబు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ఓటర్లను కోరారు. మండల పరిధిలోని జానకిపురం, చిన్నబీరవల్లి, సీతానగరం, రాపల్లి, బ్రాహ్మణపల్లి, రామా పురం, గార్లపాడు గ్రామాలలో సిపిఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ విజయం కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచార సభలలో మందడపు సాయిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా లింగాల కమల్‌ రాజు వీరిద్దరూ ఇప్పటికే ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు జిల్లా పరిషత్తు చైర్మన్‌గా పదవిలో ఉన్నారన్నారు. పదవిలో ఉన్నవారు ఏనాడూ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, కాని ఇప్పుడు తమను గెలిపిస్తే మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలను మోసం చేస్తూ మాయ మాటలు చెబుతున్నారని, ఆ మాయమాటలను తిప్పి కొట్టాలని ఓటర్లను కోరారు. బోడేపూడి వెంకటేశ్వరరావు వారసుడిగా పాలడుగు భాస్కర్‌ పోటీ చేస్తున్నారని, పాలడుగు భాస్కర్‌ విజయంతోటే మధిర నియోజకవర్గ అభివృద్ధి తిరిగి ప్రారంభం అవుతుందన్నారు. మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మధిరకు చేసింది ఏమిటో, జిల్లా పరిషత్తు చైర్మన్‌ కమల్‌ రాజు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాము చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పకుండా తాము అభివృద్ధి చేస్తామని చెప్పటం మరల ప్రజలను మోసం చేయటమేనన్నారు. మీ ఓట్లతో గెలిచి మిమ్మలను మోసం చేస్తున్న భట్టి విక్రమార్క, లింగాల కమల్‌ రాజులను ఈ ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ మధిర మాజీ ఎమ్మెల్యే బోడెపుడి వెంకటేశ్వరరావు వారసుడిగా ఎర్రజెండా ప్రతినిధిగా, కార్మిక సంఘం నాయకుడిగా మీ ముందుకు వస్తున్నానని, మీ సమస్యల పరిష్కారమే నా ఏజెండాగా నిరంతరం పనిచేస్తానని సిపిఎం మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ అన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాను కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించామన్నారు. ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికుల, అంగనవాడి కార్యకర్తలు, జూనియర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శుల, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అనేక రంగాల కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న తనను గెలిపించాలని ఆయన కోరారు. మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్‌రాజు మధిర నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులుగా ఉండి ఏం చేశారో మీ అందరికీ తెలుసునని మరల వారిని గెలిపించి మధిర అభివృద్ధికి ఆటంకంగా మారకుండా, తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్‌ పేరబత్తిని ప్రసాద్‌, సిపిఎం మండల కమిటీ సభ్యులు కిలారు సురేష్‌, గుగులోతు పంతు, మందడపు శ్రీనివాసరావు, పారుపల్లి పూర్ణచంద్రరావు, దొంతిబోయిన రమేష్‌, సాదినేని మల్లికార్జునరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు, కొమ్మినేని నాగేశ్వరరావు, తాతా వెంకయ్య, తాత వీరయ్య, నల్లమల నాగేశ్వరరావు, కుక్కల కోటేశ్వరరావు, షేక్‌ నాగుల మీర, గంగుల పాపారావు, గంగసాని రాఘవరావు, ఆయా గ్రామాల సిపిఎం శాఖా కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love