రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటమి తప్పదు..

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రo.
 – రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ల ప్రకటన అవకాశవాదానికి నిదర్శనం
 – దేశంలో కుల గణన చేపట్టాలి
 – కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయి
నవ తెలంగాణ-సూర్యాపేట:
ఇటీవలే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ల ప్రకటనలు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా ఉన్నాయని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమి వైపు ఉంటారో చెప్పకుండా గోడ మీద పిల్లి లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో కలిసి పని చేయడానికి  బీఆర్ఎస్ ఉవ్విళ్లూరు తుందన్నారు. దేశములో కుల గణన జరగాలని అన్ని పార్టీలు కోరుతున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం కుల గణన చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. కుల గణన చేయడం మూలంగా  అట్టడుగు వర్గాలకు ఎంతో యోగం జరుగు తుందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందే మహిళా బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని సీట్ల విషయంలో స్వష్టత రాలేదన్నారు. చర్చలు జరుగుతున్నాయని త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని, అవకాశవాద బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్రావు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.
Spread the love