రూ.1100 వివాదం..ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి

నవతెలంగాణ-మందమర్రి
రూ.1100 విషయంలో తలెత్తిన వివాదంతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో గురువారం జరిగింది. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన కామెర ప్రభాస్‌(19) మందమర్రి పట్టణం 2వ జోన్‌లోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ సివి రామన్‌ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. షూ కొనుక్కోమని తన అక్క ఇచ్చిన రూ.1100 పోయాయంటూ మూడ్రోజుల కిందట తోటి విద్యార్థులను నిలదీశాడు. దాంతో వారు ప్రభాస్‌తో గొడవకు దిగారు. ”నీ డబ్బులు కాదు మా డబ్బులే నువ్వు దొంగతనం చేశావు” అంటూ ఆరోపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటూ మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రభాస్‌ నెన్నెలలోని తన ఇంటికెళ్లి బుధవారం పురుగులమందు తాగాడు.
బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ప్రభాస్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దాడికి పాల్పడి.. ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. కానిస్టేబుల్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతానని, షూ కొను క్కుంటానని చెప్పడంతో డబ్బులు ఇచ్చానని, అవే తమ్ముని ప్రాణం తీశాయని ప్రభాస్‌ అక్క కన్నీరు మున్నీరైంది. తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేయడంతోనే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని విలపించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబీ కులు మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి ముందు బైటాయించారు. దీంతో పోలీసులు అడ్డుకొని నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, తెలంగాణ విద్యార్థి జన సమితి నాయకులు పాల్గొన్నారు.

Spread the love