ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. విమానంలోని 180 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఉదయం 7.50 గంటల సమయంలో ఇండిగో విమానం భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. 20-25 నిమిషాల తర్వాత విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ఇండిగో విమానం 6ఈ-2065లో ఎడమవైపు ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా విమానం తిరిగి భువనేశ్వర్‌లో ల్యాండ్ అయినట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందికి దింపారు. వారిని మరో విమానంలో ఢిల్లీకి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Spread the love