కేంద్ర హోంమంత్రిపై విరుచుకుపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి

నవతెలంగాణ – న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రిపై అమిత్‌షాపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ విరుచుకుపడ్డారు. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని, గ్యాంగ్‌స్టర్ల రాజధానిగా మారిందని మండిపడ్డారు. గతవారం ఈశాన్య ఢిల్లీలోని సుందర్‌ నగరిలో హత్యకు గురైన 28 ఏండ్ల యువకుని తల్లిదండ్రులను బుధవారం అతిశీ కలిశారు. రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ల రాజధానిలా మారిందని అన్నారు. నేరస్థులు, దోపిడీదారులు, గూండాలు భయంలేకుండా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఎవరిపైనైనా కాల్పులు జరిపినా, హత్యలు చేసినా, కత్తితో పొడిచినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకూడదు. ఢిల్లీలో లా అండ్‌ ఆర్డర్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరిధిలో ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్ర ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు. ప్రతి రోజూ దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయని, కానీ అమిత్‌షాకు ఎన్నికల ప్రచారం తప్ప ఇవేమీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love