‘ఢిల్లీ’ మిడతల దండు పని పట్టాలి

'ఢిల్లీ' మిడతల దండు పని పట్టాలి– రైతుబంధు ఆపిన కాంగ్రెస్‌ మనకు అవసరమా..?
– శాంతిసామరస్యాలను చెడగొడుతున్న బీజేపీ
– బుల్డోజర్లు కాదు.. పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవాలి : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
”పంటలు చేతికొచ్చే సమయంలో మిడతల దండు వచ్చినట్టు.. ఐదారు రోజులుగా ఢిల్లీ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు తెలంగాణపై పడుతున్నారు.. ఓట్లతో ఆ మిడతల దండు పని పట్టాలి” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో కాంగ్రెస్‌ నాయకులు ఆంధ్రా హక్కుల గురించి మాట్లాడారు కానీ తెలంగాణ హక్కు గురించి మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణలోని 7 మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రలో కలిపినప్పుడు, కేంద్రం విభజన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్‌ నాయకులకు మాట్లాడటానికి నోరు రాలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తూ పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు సోనియా గాంధీ అక్కడే ఉన్నా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు.
బీజేపీ అబద్దాలు చెప్పడం తప్ప ఒక్కసారి కూడా నిజం చెప్పలేదని విమర్శించారు. తెలంగాణలో శాంతిసామరస్యాలను పాడుచేయడానికి ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు భాగ్యలకిë దేవాలయం అంటారు.. మరొకరు భైంసాకు వెళ్లి ఏదో చేస్తామంటారు.. కానీ మనకు భరోసా, భద్రత ఇచ్చేలా, అస్థిత్వాన్ని కాపాడటానికి ఏనాడూ బీజేపీ ప్రయత్నం చేయలేదని అన్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకులు, పార్లమెంటులో పెదవి విప్పని నాయకులు, అవసరమున్నప్పుడు తెలంగాణకు నయాపైసా ఇవ్వని వాళ్లు మనకు అవసరమా అన్నది ఆలోచించాలని ఓటర్లను కోరారు. మతం పేరు చెప్పి మంటలు పెట్టాలని ఒక పార్టీ చూస్తోందని, మరొక పార్టీ కులం పేరు చెప్పి కుతంత్రం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే.. ముస్లింలకు ఎంత నష్టం జరుగుతుందో.. హిందువులకూ అందే నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ ఆలోచన లేక కొన్ని పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. మంచోళ్లు కావాలా ముంచేటోళ్లు కావాలా అన్నది తేల్చుకునే సందర్భం వచ్చిందన్నారు. రైతుబంధు నిధులను కాంగ్రెస్‌ పార్టీ వెంటబడి మరీ నిలిపివేయించిందని, రైతుల నోటి కాడి బుక్కను లాక్కొని ఆ పార్టీ రైతు వ్యతిరేకతను చాటుకుందని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. తెలంగాణలో బుల్డోజర్‌ నడపాల్సిన సమయం వచ్చిందని అంటున్నారని, వెయ్యి బుల్డోజర్లు నడిపినా వాటిపై దాడి చేయడానికి కారు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ”బుల్డోజర్లు నడపడం మా ఆలోచన కాదు. పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవాలన్నదే మా ఆలోచన. సాగు, తాగు నీళ్లు అందించాలన్నది, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలన్నది మా ఆలోచన. మీ లాగా ఇండ్లను కూల్చేయడం కాదు.. ఇండ్లు నిర్మించడం మా ఆలోచన” అని చెప్పారు.

Spread the love