చవులూరించే చట్నీస్‌…

Chutneys to die for...రోజూ కూరలు తినీ తినీ బోరు కొట్టేసిందా… నోరు చప్పబడి పోయిందా… నాలుక కొత్త రుచిని కోరుకుంటుందా… అయితే కాస్త పచ్చడి రుచి చూడండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే నువ్వులు, మునగాకు, కాప్సికమ్‌, కాలీఫ్లవర్‌ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ రోజు తెలుసుకుందాం…
నువ్వుల పచ్చడి
కావలసిన పదార్థాలు : నువ్వులు – వంద గ్రాములు, ఎండుమిర్చి – మూడు, చింతపండు – నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు, అల్లం – ఒక రెబ్బ, కొబ్బరి తురుము – రెండు చెంచాలు, కరివేపాకు – తగినంత, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం : ముందుగా స్టౌ మీద కడాయి పెట్టి వేడయ్యాక అందులో నువ్వులను దోరగా వేపుకోవాలి. రెండు లేదా మూడు నిమిషాల తర్వాత దాన్ని ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కొబ్బరి తురుము, ఉప్పును చేర్చి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో నువ్వులను కూడా చేర్చి రుబ్బుకుంటే నువ్వుల పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడికి పోపు పెట్టుకుని వేడి వేడి అన్నంలోకి లేదా పప్పు, మజ్జిగతో అన్నం తీసుకునేటప్పుడు నంజుకుంటే టేస్టు అదిరిపోద్ది.
కాప్సికమ్‌ పచ్చడి
కావలసిన పదార్థాలు : క్యాప్సికమ్‌ – పావు కిలో, కారం – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, చింతపండు – సరిపడా, అల్లం, వెల్లుల్లి ముద్ద – చెంచా, నూనె – తగినంత, జీలకర్ర – అర చెంచా, పసుపు – కొద్దిగా, జీలకర్ర పొడి – చెంచా, మెంతిపొడి – చెంచా.
తయారు చేసే విధానం : ముందుగా క్యాప్సికమ్‌ కడిగి, తుడిచి, అంగుళం ముక్కలుగా కట్‌ చేసి గింజలు తీసేసు కోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ వెలిగించి ప్యాన్‌ పెట్టి నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేగాక క్యాప్సికమ్‌ ముక్కలు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర పొడి, మెంతిపొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మసాలా ఉడికి నూనె తేలగానే స్టవ్‌ ఆఫ్‌ చేసి పొడి సీసాలో భద్రపరచుకోవాలి.
కాలీఫ్లవర్‌ పచ్చడి
కావలసిన పదార్థాలు : కాలీఫ్లవర్‌ – ఒకటి, కారం – నాలుగు చెంచాలు, ఉప్పు – మూడు చెంచాలు, ఆవపిండి – నాలుగు చెంచాలు, మెంతిపిండి – చెంచా, వెల్లుల్లి రెబ్బలు – 10, నూనె – తగినంత.
తయారు చేసే విధానం : స్టవ్‌ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి అందులో తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలని వెయ్యాలి. మూత పెట్టకుండా కాస్త ఎరుపు రంగు వచ్చేదాకా వేయించి ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఆ ముక్కలలో కారం, ఉప్పు, మెంతి పిండి, ఆవపిండి, పసుపు వేసి కలుపుకోవాలి. కాస్త పులుపు కావాలనుకుంటే రెండు చెంచాల నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా తయారయిన మిశ్రమంలో వెల్లుల్లితో పోపు పెట్టుకుంటే చాలు. ఘుమఘుమలాడే కాలీఫ్లవర్‌ పచ్చడి రెడీ అయినట్టే.
నువ్వుల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమద్ధిగా ఉన్నాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, గుడ్‌ ఫ్యాట్స్‌ వున్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
మునగాకు పచ్చడి
కావలసిన పదార్థాలు : లేత మునగాకు – రెండు కప్పులు, చింతపండు, ఉప్పు – రుచికి సరిపడా, వెల్లుల్లి – పది రెబ్బలు, కరివేపాకు – నాలుగు రెబ్బలు, ఆవాలు – చెంచా, నూనె – చెంచా, ఎండుమిర్చి – పది, పచ్చిమిర్చి – ఎనిమిది
తయారు చేసే విధానం : ముందుగా ఒక నూనెలో ఎండుమిర్చి, పోపు దినుసులు వేయించి కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరో పెద్ద కడాయిలో మునగాకు వేయించి ఉప్పు, చింతపండు గుజ్జు, పసుపు వేసి మూత పెట్టాలి. ఆకులు మగ్గిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి. దీనిని పచ్చడిలా రుబ్బుకుని పోపు పెట్టుకోవాలి.
మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు, మినరల్స్‌ వున్నాయి. వీటిని సుదీర్ఘకాలం పాటు ఆహారంలో కలిపి తీసుకున్నట్టయితే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఎనీమియా, ఆర్థరైటిస్‌, లివర్‌ వ్యాధులు, చర్మ సంబంధ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. అలాంటి మునగాకుతో పచ్చడి చేసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

Spread the love