కమ్మని మామిడి రుచులు

వేసవి కాలం అంటే మామిడి కాయలు, పండ్ల సీజన్‌.. మామిడితో రకరకాల ప్రయోగాలు చేయని వారుండరు. మామిడి రుచికి ఫిదా కాని వారుండరు. వీటితో అనేక వంటకాలను తయారు చేసి ఆస్వాదించవచ్చు. పచ్చళ్ళు, పప్పు, సాంబర్‌, జ్యూస్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలే ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి మామిడికాయలతో చేసే వంటకాలు మారుతుంటాయి.
ఆంధ్ర స్పెషల్‌ మామిడికాయ పప్పు
కావాల్సిన పదార్థాలు :
పప్పు తయారు చేసేందుకు… పచ్చిమిర్చి – రెండు (పొడవుగా కోసుకోవాలి), కంది పప్పు – కప్పు, పసుపు పొడి – అర టీ స్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా
మామిడికాయలు వండడానికి… మామిడికాయ – ఒకటి (తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి), పసుపు పొడి – పావు టీస్పూన్‌, మిరియాల పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌, నీరు – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా,
పోపు కోసం… నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌, ఆవాలు – అర టీ స్పూన్‌, వెల్లుల్లి – రెండు రెబ్బలు, ఎండుమిర్చి – రెండు, కరివేపాకు – కొద్దిగా, కొత్తిమీర – కొద్దిగా
తయారు చేయు విధానం : ముందుగా కుక్కర్‌లో కడిగిన పప్పు, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి స్టౌ మీద పెట్టి కుక్కర్‌ మూతపెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్‌లో ప్రెజర్‌ దానంతట అది పోయే వరకు అలా ఉంచాలి. తర్వాత పప్పును మెత్తగా చిదిమేసి పక్కన పెట్టుకోవాలి.
మామిడికాయ ఉడకబెట్టేందుకు కుక్కర్‌లో మామిడి కాయ ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు, కారం, అర కప్పు నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి పది నిముషాలు ఉడికించుకోవాలి. కుక్కర్‌లో అయితే ఒక విజిల్‌ వచ్చిన తర్వాత దించాలి.
తాలింపు కోసం స్టౌ మీద ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టి అందులో నెయ్యి పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేయాలి. తర్వాత ఎండు మిర్చి, వెల్లుల్లి వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి, కరివేపాకు వేసి వేయించి, ఉడకబెట్టిన మామిడికాయ, మెత్తగా రుద్ది పెట్టుకున్న పప్పు వేసి, అవసరమైనంత నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, 3-4 నిమిషాలు బాగా మరిగించి, కొత్తిమీర చల్లితే, రుచికరమైన ఆంధ్రా పచ్చి మామిడి పప్పు రెడీ.
సౌత్‌ ఇండియన్‌ స్పెషల్‌
మామిడికాయ సాంబార్‌
కావాల్సిన పదార్థాలు : కందిపప్పు – కప్పు, మామిడికాయ – ఒకటి, చింతపండు : కొద్దిగా, సాంబార్‌ మసాలా పౌడర్‌ – రెండు టేబుల్‌ స్పూన్‌లు, ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌, కారం – ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర – టేబుల్‌ స్పూన్‌, ఆవాలు – టేబుల్‌ స్పూన్‌, ఎండు మిర్చి – మూడు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిగడ్డ – రెండు (సన్నగా తరిగి పెట్టుకోవాలి) దోసకాయ, సొరకాయ ముక్కలు : అర కప్పు (ఉడికించుకోవాలి) టమోటో: ఒకటి, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – 2-3, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత
తయారు చేయు విధానం : మామిడికాయ తొక్క తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, టమోటో ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ఆవిరి తగ్గిన తర్వాత పప్పును మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులోనే మిగిలిన ఉల్లిగడ్డ ముక్కలు, టమాటో, వెల్లుల్లి ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్‌ బాటమ్‌ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, దోసకాయ, సొరకాయ, టమోటో, మామిడికాయ ముక్కలు కూడా వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు గుజ్జును వేసి రెండు నిముషాలు మరిగించాలి. రెండు నిముషాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న పప్పును ఈ పోపు మిశ్రమంలో వేసి సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్‌ చేసి తక్కువ మంట మీద మరో 5-10 నిముషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే మామిడికాయ సాంబార్‌ రెడీ. వేడి వేడిగా అన్నంతో సర్వ్‌ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
తియ్యని మామిడి రవ్వ లడ్డు
కావాల్సిన పదార్థాలు : బొంబాయి రవ్వ – అర కిలో, మామిడిపండ్లు – రెండు, యాలకులు – రెండు, జీడిపప్పు, కిస్‌మిస్‌లు – గుప్పెడు, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము – రెండు కప్పులు, పంచదార – 200 గ్రాములు,
తయారు చేయు విధానం : ముందుగా బొంబాయి రవ్వను మాడకుండా సన్న మంట మీద కమ్మని వాసన వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌లు నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి కొద్దిగా నీరు పోసి బొంబాయి రవ్వను బాగా మొత్తగా ఉడికించాలి. అందులోనే పంచదార పోసి మరి కాసేపు ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలియబెట్టాలి, స్టౌ ఆఫ్‌ చేసి పచ్చికొబ్బరి తురుము కూడా వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా చల్లారాక మామిడిపండు రసం కూడా పోసి బాగా తిప్పాలి. యాలకుల పొడిని ఇందులో వేసి మిశ్రమం గట్టిపడ్డాక నిమ్మకాయ పరిమాణంలో ఉండల్లా చేసుకొని ప్లేటులో అమర్చుకోవాలి. అంతే కమ్మని రవ్వతో కలిసిన మామిడి రవ్వలడ్డూలు రెడీ.. ఆ రోజు తినడానికి ఇవి చాలా రుచిగా ఉంటాయి.
మామిడి తురుము పచ్చడి
కావాల్సిన పదార్థాలు : మామిడికాయలు – రెండు, కారం – రెండు టేబుల్‌ స్పూన్‌లు, ఆవపిండి – ఒక టేబుల్‌ స్పూన్‌, మెంతిపిండి – అర టేబుల్‌ స్పూన్‌లు, ఉప్పు –
రుచికి తగినంత, నూనె – తగినంత, తాలింపుకు – శనగ పప్పు, మినప్పప్పు – రెండు టేబుల్‌ స్పూన్‌లు, ఆవాలు – ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి –
నాలుగు, కరివేపాకు – రెండు రెమ్మలు, వెల్లుల్లి – ఆరు రెమ్మలు
తయారు చేయు విధానం : మామిడికాయలు చెక్కు తీసి తురుముకోవాలి. ఈ తురుములో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసి బాగా కలపాలి. నూనె వేడి చేసి తాలింపు వేసి ఇందులో కలిపితే తురుము పచ్చడి రెడీ. ఈ ప్రాసెస్‌లో నీళ్ళు తగలకుండా చేసుకోవాలి.
సమ్మర్‌ స్పెషల్‌ మ్యాంగో ఫిర్నీ
కావాల్సిన పదార్థాలు : బియ్యం – రెండు కప్పులు, పాలు : ఒక కప్పు, మామిడి పండు గుజ్జు – ఒక కప్పు, బాదం – ఒక కప్పు, పిస్తా పప్పు – ఒక కప్పు, యాలకులు పొడి: చిటికెడు, పంచదార – ఒక కప్పు
తయారు చేయు విధానం : బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. కొద్దిసేపు నాననిచ్చిర నీళ్ళు లేకుండా వడకట్టి, కాసేపు ఆరబెట్టాలి. తడి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. తర్వాత స్టౌమీద మందపాటి పాన్‌ పెట్టి అందులో పాలు పోసి బాగా కాగనివ్వాలి. పాలు మరిగేటప్పుడు పంచదార కూడా వేసి బాగా కలపాలి. వేరొక స్టవ్‌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి అందులో బియ్యం పిండిని పోసి కలుపుతూ ఉడకనివ్వాలి. బియ్యంపిండి ఉడకుతూ చిక్కబడే సమయంలో మామిడి పండు గుజ్జును, మరిగించిన పాలను అందులో వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమం ఇంకాస్త చిక్కబడ్డాక అందులో యాలకల పొడి వేయాలి. చల్లారక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకుని బాదం పప్పు, పిస్తా పప్పుతో అలంక రించి సర్వ్‌ చేయాలి. అంతే సమ్మర్‌ స్పెషల్‌ మ్యాంగో ఫిర్నీ రెడీ.

Spread the love