సీఎస్‌ఈ,ఐటీ అనుబంధ కోర్సులకే డిమాండ్‌

– 98.01 శాతం సీట్లు భర్తీ
– ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్లు 5,039
– 81,904 మందికి సీట్ల కేటాయింపు
– 90 కాలజీలు, 22 బ్రాంచీల్లో వంద శాతం సీట్లు భర్తీ
– 15 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు
– కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు 17 దాకా అవకాశం
– ఎప్‌సెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రవేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సులకే భారీగా డిమాండ్‌ ఉన్నది. ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరానికిగాను 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సాంకేతిక విద్యాశాఖ సోమవారం సీట్లు కేటాయించింది. సీఎస్‌ఈ, టీ అనుబంధ కోర్సుల్లో చేరేందుకే అభ్యర్థులు మొగ్గు చూపారు. ఆయా బ్రాంచీల్లో 61,587 సీట్లుంటే, 60,362 (98.01 శాతం) మందికి సీట్లు కేటాయించారు. వాటిలో 1,225 (1.99 శాతం) సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో 175 ఇంజినీరిగ్‌ కాలేజీల్లో 86,943 సీట్లున్నాయి. వాటిలో 81,904 (94.20 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఇంకా 5,039 (5.80 శాతం) సీట్లు మిగిలాయి. ఈ మేరకు ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుదివిడతలో కొత్తగా 9,881 మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 16,981 మంది స్లైడింగ్‌ చేసుకున్నారని తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యలో 47 కర్సులు అందుబాటులో ఉన్నాయనీ, వాటిలో 22 కోర్సుల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. రాష్ట్రంలో ఆరు యూనివర్సిటీ, 84 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 90 కాలేజీల్లో వంద శాతం ప్రవేశాలను కల్పించామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 6,460 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయకుంటే ఆ సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు మంగళవారం నుంచి ఈనెల 17 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. విద్యార్హతలకు సంబంధించి జిరాక్స్‌ ప్రతులు, ఒరిజినల్‌ టీసీని కాలేజీల్లో అందించాలని సూచించారు. ఈనెల 16 వరకు సీట్లను రద్దు చేసుకునేందుకు అవకాశముందని తెలిపారు. ఇతర వివరాల కోసం https.://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సుల్లో 77.53 శాతం సీట్లు భర్తీ
సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 61,587 సీట్లుంటే, 60,362 (98.01 శాతం) మందికి సీట్లు కేటాయించారు. వాటిలో 1,225 (1.99 శాతం) సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ అనుబంధ కోర్సుల్లో 16,692 సీట్లుంటే, 14,907 (89.31 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 1,785 (10.69 శాతం) సీట్లు మిగిలాయి. సివిల్‌, మెకానిల్‌ అనుబంధ కోర్సుల్లో 7,458 సీట్లుండగా, 5,782 (77.53 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1,676 (22.47 శాతం) సీట్లు మిగిలాయి. ఇతర ఇంజినీరిగ్‌ కోర్సుల్లో 1,206 సీట్లుంటే, 853 (70.73 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 353 (29.27 శాతం) సీట్లు మిగిలాయి. ఇంజినీరింగ్‌లో 47 కోర్సులుంటే 22లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బిల్డింగ్‌ సర్వీసెస్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 66 సీట్లుంటే, తొమ్మిది (13.64 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 57 (86.36 శాతం) సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 21 సీట్లుంటే, నలుగురు (19.05 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 17 (80.95 శాతం) సీట్లు మిగిలాయి. ప్లానింగ్‌ కోర్సులో 44 సీట్లుండగా, 12 (27.27 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 32 (72.73 శాతం) సీట్లు మిగిలాయి. ఫార్మాసూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 69 సీట్లుంటే, 23 (33.33 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 46 (66.67 శాతం) సీట్ు మిగిలాయి.

Spread the love