– ఆ తర్వాతే సామాన్యుల భవనాలవైపు వెళ్లండి
– పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీలవి అక్రమ నిర్మాణాలే : కేటీఆర్
– బీఆర్‌ఎస్ శ్రేణులు, జర్నలిస్టుల మీద దాడులపై డీజీపీకి ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ, తదితర నేతల ఇండ్లను ముందు కూల్చాలనీ, ఆ తర్వాత సామాన్యుల భవనాల వైపు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపైనా, బీఆర్‌ఎస్ కార్యకర్తలపైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లో డీజీపీ డాక్టర్ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసుల తీరు సరిగా లేదని ఆయన వద్ద ప్రస్తావించారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా రైతు నిరసన దీక్ష చేస్తే 50 కాంగ్రెస్ గుండాలు రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడులు చేశారని ఆరోపించారు. పోలీసులే తమ నిరసన దీక్ష టెంట్‌ను కూల్చేయటం దారుణమన్నారు. రుణమాఫీపై చర్చకు ఏఊరైనా వెళ్దామని సవాల్ చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి రాలేదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో తిరగాల్సిన సీఎం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. సీఎం సొంతూరులో రుణమాఫీ అయ్యిందా? లేదా? అని తెలుసుకోవడానికి మహిళా జర్నలిస్టులు వెళితే వారిపై కాంగ్రెస్ కార్యకర్తలు చిల్లరగా దాడులు చేయడం దుర్మార్గమని చెప్పారు. వాళ్లను వెల్దండ పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారని తెలిపారు. జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై సోషల్‌మీడియాలో నికృష్టంగా విషప్రచారం చేయడం దారుణమన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనీ, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసినవారిపైనా, తిరుమలగిరిలో బీఆర్‌ఎస్ దీక్షపై దాడిచేసిన వారిపైనా కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలతో ఎమ్మెల్యే తీరుతో తమ నాయకుడు గొంతు కోసుకున్నాడని తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గాడి తప్పాయనీ, నెలలో 28 హత్యలు జరిగాయని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దనే మేము ఇప్పటి వరకు ఊరుకుంటున్నామన్నారు. తమ సహనాన్ని, చేతగాని తనం అనుకోవద్దనీ, తాము ప్రతిఘటించే దాకా పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్‌డే కార్యక్రమాల్లో పరవశించి పోతున్నారని విమర్శించారు.