పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్: పింకీ సోంకర్‌ ఇంటి కూల్చివేతకు అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేశారని ఆమెతో పాటు కొందరు గ్రామస్తులకు ఈ నోటీసులను అందజేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని మిర్జాపుర్‌ కు చెందిన పింకీ సోంకర్‌ చీలిక పెదవితో జన్మించారు. తన జీవితం ఆధారంగా తీసిన ‘స్మైల్‌ పింకీ’ డాక్యుమెంటరికీ 2008లో ఆస్కార్‌ అవార్డు లభించింది. సామాజిక కార్యకర్తల సహకారంతో తన చీలిక పెదవికి శస్ర్త చికిత్స చేయించేందుకు ఆమె ప్రయాణం ఎలా సాగిందనే అంశాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. పింకీ తన కుటుంబంతో కలిసి రాంపుర్‌ దాభి గ్రామంలో నివాసముంటున్నారు. తాజాగా ఆమెతో పాటు గ్రామంలోని 30 కుటుంబాలకు అటవీ శాఖ అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేశారు. వారు నివసిస్తున్న స్థలం అటవీ శాఖకు చెందిందని.. అక్రమంగా అందులో ఇళ్లు నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది. ‘పింకీ జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్‌ అవార్డు రావడంతో అటవీ శాఖ అధికారులు ఈ భూమిని అందించారు’’ అని గ్రామస్తులు పేర్కొన్నారు. తాము ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించే సమయంలో అటవీ శాఖ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్‌ తెలిపారు. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రియాంక నిరంజన్‌ స్పందించారు. ఈ నోటీసులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కారిస్తామని.. ఈ విషయంపై ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె తెలిపారు. దీని గురించి రెవెన్యూ, అటవీ శాఖలకు సమాచారం అందించామని పేర్కొన్నారు.

Spread the love