– కూల్చివేత చివరి చర్యగా ఉండాలి..
– అధికారుల తీరుపై మధ్యప్రదేశ్ హైకోర్టు అసహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇల్లు కూల్చివేతపై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇండోర్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్ అధికారులు ఆమె ఇంటిని తప్పుగా కూల్చివేశారని పేర్కొన్న న్యాయస్థానం.. సరైన ప్రక్రియ అనుసరించకుండా ఇండ్లు కూల్చివేయడం స్థానిక పాలనా సంస్థలు, అధికారులకు ‘ఫ్యాషన్’ అయిపోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. బాధిత మహిళకు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అధికారులు సహజ న్యాయ సూత్రాన్ని పాటించకుండా ఇష్టానుసారం ఇండ్లు కూల్చివేయడం..దానికి సంబంధించిన వార్త మీడియాలో వచ్చేలా చేయడం ఫ్యాషన్ అయిపోయిందని జస్టిస్ వివేక్ రుసియా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కూల్చివేత అనేది ‘చివరి చర్య’గా ఉండాలని, అది కూడా ఇంటిని క్రమబద్ధీకరించుకొనేందుకు యజమానికి సరైన అవకాశం ఇచ్చిన తర్వాత చేపట్టాలని అభిప్రాయపడింది.