– కూల్చివేతలో ఆధునిక టెక్నాలజీ వినియోగం
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాలం చెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) పాత ప్లాంట్ (ఓఅండ్‌ఎమ్)లోని కూలింగ్ టవర్లు నేలమట్టం అయ్యాయి. సోమవారం ఉదయం 8.25 గంటలకు ఏ- స్టేషన్లోని నాలుగు కూలింగ్ టవర్లను అధికారులు ఒకసారిగా కూల్చేశారు. తరువాత బి- స్టేషన్‌లోని రెండు టవర్లను, సీ- స్టేషన్లోని మరో రెండు టవర్లను ఆధునిక టెక్నాలజీతో ఉన్నచోటనే నేలమట్టం చేశారు.
పాత ప్లాంట్ తొలిగింపు కాంట్రాక్ట్ దక్కించుకున్న హెచ్‌ఎర్ కమర్షియల్ సంస్థ ఈ టవర్ల కూల్చివేతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎక్సిక్యూడ్ కంపెనీకి అప్పగించింది. కంపెనీ డైరెక్టర్ ఆనంద్ శర్మ సారథ్యంలో ఇంప్లోజన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలేలా పేలుడు పదార్ధాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో శాఖ నుంచి విద్యుత్ లైన్ల క్లియరెన్స్ రాగానే, కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సెకండ్ల వ్యవధిలో టవర్లు నేలమట్టం అయ్యాయి. టవర్ల శకలాలు దూరంగా పడకుండా అక్కడే కుప్పకూలేలా పిల్లర్ల చుట్టూ ఐరన్ మెస్లను ఏర్పాటు చేసి, క్లాత్‌తో సీల్ చేశారు. ఇప్పటికే కర్మాగారంలోని మిగతా విభాగాలను తుక్కుగా మార్చి తరలించడంతో చివరికి ఈ టవర్లు మాత్రమే మిగిలాయి. అవి కూడా ఈ రోజుతో పూర్తిగా కనుమరుగయ్యాయి.
1965-78లో కేటీపీఎస్ ఓఅండ్‌ఎం ప్లాంట్ నిర్మాణం చేశారు. పాల్వంచ అంటే కేటీపీఎస్, దానిలో టవర్లు ఆనవాళ్లుగా చెప్పొచ్చు. 115 మీటర్ల ఎత్తులో ఉన్న ఇవి కొన్ని మైళ్లదూరం వరకు కనిపిస్తాయి. జపాన్ టెక్నాలజీతో కేటీపీఎస్ ఓఅండ్‌ఎమ్ కర్మాగారాన్ని నిర్మించారు. ఏ, బీ, సీ, స్టేషన్లలోని 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 1, 2, 3, 4 యూనిట్లు, 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5, 6, 7, 8 యూనిట్లు చేపట్టి 720 మెగావాట్లతో రాష్ట్రానికి వెలుగులు పంచారు. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో కూలింగ్ టవర్ చొప్పున మొత్తం 8 నిర్మించారు. విద్యుదుత్పత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించిన క్రమంలో వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపయోగ పడతాయి. నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడంతో ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.