– అడ్డుకున్న గరీబోళ్లు, మహిళలు పోలీస్ స్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కురవి గేట్ సమీపంలోని సర్వే నెంబర్ 255/1 ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు వేసిన గుడిసెలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, అటవీశాఖ అధికారులు మంగళవారం తెల్లవారక ముందే జేసీబీలతో వచ్చి పేదల గుడిసెలను నేలమట్టం చేసేందుకు ప్రయత్నించారు. భోజనాలు వండుకుంటుండగా దౌర్జన్యంగా గుడిసెలు కూల్చివేయడంతో పేదలు బోరున విలపించారు. అన్నం గిన్నెలు, ఉప్పు, పప్పు, నూనె, చింతపండు వంట సామాగ్రి రోడ్డుమీద పడటంతో పేదలు దిక్కులేని వారయ్యారు. గుడిసెలు కోల్పోయిన పేదలు నిరాశ్రయులయ్యారు. ధర్నా నిర్వహించగా.. పోలీసులు 10 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది భూ అక్రమణదారులు 255/1 సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఆ భూమిలో గతేడాది సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. కానీ గత ప్రభుత్వంలోని కొంత మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 17సార్లు ఆ గుడిసెలను తొలగించి పార్టీ నాయకులు, మహిళలపై అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఆ భూమిని కబ్జాచేసి అమ్ముకోవాలని ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గని పేదలు.. మళ్లీ గుడిసెలు వేసుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు ఇండ్ల స్థలాలు దక్కుతాయని పేదల్లో భరోసా ఏర్పడింది. అంతలోనే మళ్ళీ రెవెన్యూ, మున్సిపాలిటీ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు జేసీబీ, బుల్డోజర్లతో పేదలు వేసుకున్న గుడిసెలపై దాడి చేసి గుడిసెలను కూల్చివేశారు. దాంతో ఆగ్రహించిన గుడిసె వాసులు, మహిళలు సీపీఐ(ఎం) నాయకులు కూల్చివేతను అడ్డుకొని గంటసేపు నిలువరించారు. దాంతో అధికారులకు, గుడిసె వాసులకు మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. గుడిసె వాసులు అధికారులకు మధ్య వాదోపవాదాలు, నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. దాంతో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్, నాయకులు బానోతు వెంకన్న, బూర్గుల లక్ష్మణ్‌తో పాటు మరో 8 మంది మహిళలు, పురుషులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికార యంత్రాంగం ఏకపక్షంగా పేదల గుడిసెలను పూర్తిగా తొలగించి అక్రమ కేసులు పెట్టి వారిని భూమి పైకి రాకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది, గుడిసెలు తొలగించి భూ కబ్జాదారులకు అప్పగించాలని చూస్తున్నారని గుడిసెవాసులు ఆరోపించారు. ఎన్నిసార్లు నిరుపేదల గుడిసెలను తొలిగించినా ఎన్ని కుట్ర కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని, మళ్ళీ మళ్ళీ గుడిసె వాసుల పక్షాన నిలబడి భూమి దక్కేవారకు పోరాటం కొనసాగిస్తామని సీపీఐ(ఎం) నాయకులు స్పష్టంచేశారు. గుడిసె వాసులు రెండు గంటలపాటు అధికార యంత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.