– ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల విజృంభన
– ఆగస్టులో 350 కేసులు..
– ఈ నెలలో ఇప్పటికే 200 మంది
– పరిసరాల అపరిశుభ్రత.. దోమల వ్యాప్తి
– పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ గాలికి..
– ప్రయివేట్ ఆస్పత్రుల్లో దోపిడి
– సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహనలోపం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
డెంగీ పంజా విసురుతోంది. వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వాతావరణంలో పెనుమార్పులొచ్చాయి. పరిసరాల అపరిశుభ్రత.. నీటి కాలుష్యం పట్ల పర్యవేక్షణ లోపించడంతో జ్వరం, జలుబు, కండ్ల కలక వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ ఇన్‌స్పెక్షన్‌తో పిల్లలు బాధపడుతున్నారు. కండ్ల కలకైతే నెల రోజుల పాటు పిల్లల్ని, పెద్దల్ని తల్లడిల్లేలా చేసింది. సీజనల్ వ్యాధులతో ప్రతి ఏటా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లో అవగహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. జ్వరంతో ఆస్పత్రులకెళ్తే డెంగ్యూ పేరిట దోపిడీ చేస్తున్నారు. వారం రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల వర్షపునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందాయి. వీధుల్లో, మురికి కాల్వల్లో చెత్తను తొలగించి శుభ్రం చేయడంలో పంచాయతీలు, మున్సిపాలిటీలు శ్రద్ధ చూపట్లేదన్న విమర్శ ఉంది. వృద్ధి చెందిన దోమలు కాటేయడం వల్ల డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి.
ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో జ్వరంతో బాధపడుతున్న వాళ్లు చేరుతున్నారు. రెండు మూడు రోజులైనా జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గకపోయే సరికి ఆస్పత్రులకు వెళ్తున్నారు. దాంతో పరీక్షించిన వైద్యులు డెంగ్యూ పరీక్ష చేయిస్తున్నారు. డెంగ్యూ లక్షణాలు లేకపోయినా అనుమానంతో ఆస్పత్రుల్లో రోగుల్ని అడ్మిట్ చేసుకుని వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల రికార్డుల ప్రకారం ఈ నెల రెండు వారాల్లోనే సంగారెడ్డి జిల్లాలో 100 మంది వరకు డెంగ్యూ బారిన పడినట్టు చెబుతున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ మరో వంద మంది వరకు ఆస్పత్రుల్లో చేరారు. ఇక ప్రయివేట్ క్లీనిక్‌లు, ఆస్పత్రుల్లో డెంగ్యుకి వైద్యం చేయించుకుంటున్న వాళ్ల సంఖ్య లెక్కనేలేదు. ఈ నెలలో 200 వరకు డెంగ్యు కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో సంగారెడ్డి జిల్లాలో 185 కేసులు, మెదక్‌లో 54, సిద్దిపేటలో 85 కేసుల వరకు నమోదయ్యాయి. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా డెంగ్యూ దోమ కాటుకు గురవుతున్నారు. పగటి పూట కుట్టే దోమ వల్ల వచ్చే డెంగీని ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం చేయించుకుంటే ప్రమాదమేమీ ఉండదు. ఆలస్యం చేస్తేనే ప్లేట్‌లెట్స్ తగ్గి ప్రాణాప్రాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్‌లేట్స్ తగ్గాయని, అవి పెరగాలంటే ఖరీదైన ఇంజక్షన్లు, మందులు వాడాలనే పేరుతో ప్రయివేట్ ఆస్పత్రుల్లో దోపిడికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు సైతం తమ స్వంత ఆస్పత్రులు లేదంటే వారు పనిచేసే ప్రయివేట్ ఆస్పత్రులకు రోగుల్ని పంపుతున్నారు.
పరిసరాల పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం
దోమ కాటు వల్లనే డెంగ్యూ, మలేరియా లాంటి విషపు జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దోమలు వృద్ధి చెందడానికి మురుగ నీరు నిల్వ ఉండటమే అనే అవగాహన ప్రజల్లో పెరగాల్సి ఉంది. సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, అమీన్‌పూర్, బొల్లారం, తెల్లాపూర్, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, చేర్యాల, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ వంటి మున్సిపాలిటీ పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో వ్యాపారాలు విస్తరించాయి. ముఖ్యంగా వీధి వ్యాపారులు సాగుతున్నాయి. తాగి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, పాత సమన్లు.. తదితరు వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో వాటిల్లో వర్షపు నీరు చేరి నిల్వ ఉంటుంది. మురికి కాల్వల్ని కూడా రెగ్యులర్‌గా శుభ్రం చేయకపోవడం, నాలాలపై పై కప్పు ఉండటంతో వాటిని శుభ్రం చేయడమే వీలుకాకపోవడంతో దోమలు సంవృద్ధిగా వృద్ధి చెందుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మండల, మున్సిపల్, జిల్లా కేంద్రాల్లోనూ చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్న పరిస్థితి లేదు. రెండు మూడు రోజులు చెత్త పేరుకుపోతుంది. వర్షాలు పడిన వారం రోజుల పాటు ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది. వర్షపు నీటిపై దోమలు లార్వా పెట్టి తన సంతాన్ని వృద్ధి చేస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు రెగ్యులర్‌గా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. మురికి కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్‌పౌడర్ చల్లడం, ఇతర రసాయనాలను స్ప్రే చేయడం ద్వారా దోమల్ని నియంత్రించాలన్న అవగాహనను ప్రజల్లో కల్పించే పని నామమాత్రంగా జరుగుతుంది.
ప్రజల్లో అవగహన కల్పిస్తున్నాం
సీజనల్ వ్యాధుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలనే విషయాల గురించి ప్రజల్లో అవగహన కల్పిస్తున్నాం. జ్వరంతో బాధపడే వాళ్లు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. డెంగ్యు అయినంత మాత్రాన జనం భయపడాల్సిన పనిలేదు. వైద్యం అందుబాటులో ఉంది. పరిసరాల పరిశుభ్రత పట్ల కూడా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలతో కలిసి కరపత్రాలు, ఇతర రూపాల్లో ప్రచారం చేస్తున్నాం.
– డాక్టర్ గాయత్రిదేవి,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి