
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన వారం రోజుల్లో డెంగీ విస్తృతి మరింత వేగవంతమైంది. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కేవలం ఏడు రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన మొత్తం డెంగీ కేసుల సంఖ్య 348కి చేరింది. 2018 నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదేండ్లలో ఆగస్టు 6 నాటికే డెంగీ కేసుల సంఖ్య 175 దాటడం ఇదే తొలిసారి. ఆగస్టు 6 నాటికి 2018లో 64 కేసులు, 2019లో 47 కేసులు, 2021లో 55 కేసులు నమోదు కాగా 2020లో కేవలం 35 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2022లో అధికంగా అంటే 174 కేసులు కాగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 348 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.