అభ్యుదయ సాహితీ కేతనం

”త్రికాల జ్ఞానంతో కూడిన పుష్కలమైన విషయజ్ఞత, అనితర సాధ్యమైన శిల్పజ్ఞత, సంస్కార సహజమైన ఉద్రేక రహిత భావుకత్వం వున్న గొప్ప కథకుడాయన. కథను ఒక సామాజిక సంస్కార శక్తిగా నిరూపించిన కథకుడాయన” (పుట-115, తెలుగు కథా రచయితలు) అని కొడవటిగంటి కుటుంబరావు గురించి ఓ వ్యాసంలో కేతు విశ్వనాథరెడ్డి చెప్పింది సరిగ్గా వారి గురించి కూడా చెప్పాల్సి వస్తే ఇవే మాటలు సరిపోతాయి. ఇటువంటి వీరు వ్యాసం, కథ, నవల, నాటిక, సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన, పత్రికా రచన – సంపాదకత్వం, పాఠ్య రచన, అధ్యాపన, అరసంలో వివిధ హోదాల్లో బాధ్యతలతో పాటు, ఇతర సంస్థలతోనూ కలిసి పని చేశారు. ఇలా పలు రంగాల్లో కషి సలిపి తనదైన ముద్రవేశారు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి. అయినా విశ్వనాథ రెడ్డికి కథకులుగా మాత్రమే ఎక్కువ కీర్తి వచ్చింది. తెలుగు కథకు మంచి గుర్తింపు తెచ్చారు. రాయలసీమ బతుకు చిత్రాన్ని అక్షరీకరించారు. ఆ మహనీయుడు ఇటీవలె సాహితీ లోకాన్ని కన్నీటి సంద్రంలో విడిచి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయన సాహితీ ప్రయాణాన్ని మననం చేసుకుందాం…
కేతు విశ్వనాథరెడ్డి కథలు-2
‘కేతు విశ్వనాథరెడ్డి కథలు-2’ పేరుతో విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు జనవరి 2009లో ప్రచురించారు. 1998-2003 మధ్యలో వచ్చిన కథానికలను పుస్తకంగా వెలువరించారు. ఇందులో ఒక వాల్మీకి, పోలికలు, ముఖదర్శనం, స్వస్తి, మాయపొరలు, కాంక్ష, రెండు ప్రపంచాల మధ్య, అమ్మవారి నవ్వు, దగ్గరైన దూరం, దూరమైన దగ్గర, సంకట విమోచని, పొడి నిజం, విరూపం, పనిమంతురాలు, దాది, మిడిసిపాటు కథానికలతో పాటు అనాది వాళ్ళు, చీకటి తప్పు, వానకురిస్తే వంటి అన్య సంపుటాల్లోని కొన్ని కథలూ గ్రహింపబడి మొత్తం 44 కథానికలూ ముద్రితమైనాయి.
1939 జులై 10న కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలుకా, రంగశాయిపురంలో నాగమ్మ, వెంకటరెడ్డి దంపతులకు జన్మించారు వీరు. కడప జిల్లా ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అంటే 1958లోనే ‘అమ్మ’ అనే కథ రాశారు. అప్పటికి వారి వయసు 19 ఏండ్లు మాత్రమే. ఆ తర్వాత రాసిన ‘అనాదివాళ్ళు’ అనే కథను 1963లో రాశారు. ఇదే వీరి తొలి ముద్రిత రచన. అనంతరం వందలాది కథల్ని వెలువరించారు. అవి జప్తు, కేతు విశ్వనాథరెడ్డి కథలు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు-2 సంపుటాలుగా ముద్రితమయ్యాయి.
అనేక సార్లు పున:ముద్రణ
‘జప్తు’ కథా సంపుటి 1974 వెలువడింది. ఇందులో అనాది వాళ్ళు, చీకటి తప్పు, వానకురిస్తే, దాపుడుకోక, జప్తు, సమిధ, శిలువ వేసిన, మనుషులు, చక్రబంధం, వైరుధ్యం ఇత్యాది కథానికలున్నాయి. ఇది కన్నడ భాషలోకి అనువాదమైంది. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ అనే పుస్తకం 1991లో వచ్చింది. ఇది 1994, 1999, 2009లలో పున:ముద్రితమైందంటే వీరి కథలకున్న ఆదరణ ఊహించొచ్చు. ఇందులో 1974-1991 మధ్య రాసిన 30 కథలున్నాయి. ఈ సంపుటిలో మార్పు, సానుభూతి, ఆత్మరక్షణ, వెనుకాముందు, ప్రేమ రూపం, మన ప్రేమ కథలు, పద్ధతి, అనధికారం, పారువేట, విశ్వ రూపం, ఆ రోజులే వస్తే, దప్పిక, చీకటినా డీ-వెలుగు నెత్తురూ, దూరం, మీదే మీదే సమస్త దేవం, పీర్లసావిడి, సందాకబళం, మహిమ, సొతంత్రం, గడ్డి, నమ్ముకున్న నేల, అన్నదాతలు, శ్రుతి, ఎవరు వీరు, కూలిన బురుజు, తలాడించే బొమ్మ, తేడా, రెక్కలు మొదలైనవి ఉన్నాయి.
ఇచ్ఛాగ్ని
1997లో ముద్రితమైన ‘ఇచ్ఛాగ్ని’ కథానికల సంపుటిలో వానకురిస్తే, దాపుడుకోక, జప్తు, ద్రోహం, తారతమ్యం, యాష్‌-అగ్గిపుల్లా, బజారు, తాయం, ఒక దష్యం, మరో చిత్రం, సతి, రుచి, అంతర్ముఖం, నిప్పు -నివురు, సింహాసనం, ఇచ్ఛాగ్ని, నిజం కాని ఒక నిజం కథ, ఇంకా దయ్యాల కథే, ఉయ్యాల ఉసురు, అంత్యాక్షరి, అంతరం, ఒక జీవుడి వేదన మొదలైనవి ఉన్నాయి.
ప్రజల కష్టాలే కథలుగా
ఈ కథల్లో మచ్చుకి ‘వాన కురిస్తే’ అనే కథను సంక్షిప్తంగా చూద్దాం. నీళ్ళు లేకపోతే జీవికి మనుగడే లేదు, మానవులకు నాగరికతలే లేవు. అటువంటి నీళ్ళు భూమిలో లేవు, వానకోసం ఎదురు చూడాల్సిందే. ఏళ్ళు గా నిరాశకు గురికావడం, సాగునీరు లేకపోవడంతో తిండిలేదు మనిషికి. అంతేగాదు గడ్డి లేకపోవడంతో పశువులకూ తిండి లేదు. ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో పౌరులు, రైతులూ ఎంతగా చితికి పోతున్నారో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇందులో చక్కటి రాయలసీమ మాండలిక భాష ఉంది. ఈ కథానిక కన్నడ భాషలోకి పి.బి. శివణ్ణ అనువదించారు. ఈ విధంగా విశ్వనాథరెడ్డి కథల్ని గమనిస్తే రాయలసీమ ప్రజల కష్టాల్ని, ప్రజల భాషలోనే చక్కగా రాయ బడినవని అర్థమవుతుంది. వీరి కథలు కొన్ని హిందీ, తమిళంతో పాటు ఆంగ్లం, రష్యన్‌ వంటి విదేశీ భాషలోకి అనువదించబడినవి.
దళితుల బాధలు చూపిన ‘వేర్లు’
విశ్వనాథరెడ్డి వేర్లు (1978), బోధి (1984) అనే రెండు నవలికలను రాశారు. వీటిల్లో మచ్చుకు ఒకటి చూద్దాం. 1978లో రచితమైన ‘వేర్లు’ నవలికలో బ్రిటిష్‌ పాలకులు మన దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం వల్ల కొన్ని వర్గాలే ఎదగడం, వాళ్ళే అభివద్ధి ఫలాల్ని పొందడాన్ని వ్యక్తపరిచారు. ఇందులో కథానాయకుడైన దళితుడు వెంకటరాముడు ఆంత్ర పాలజీలో ఎం.ఏ. చేస్తాడు. కళాశాలలో తన ఆహారపు అలవాట్లను అసహ్యించుకునేవారు. తనకు ఇష్టమైన గొడ్డు మాంసం తినలేక పోయేవాడు. తర్వాత కాలంలో తన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క, తన తోబుట్టువులు చేస్తున్న వత్తులు చేయడానికి అయిష్టమేర్పడి బతకడమే కష్టమవుతున్న దశలో దేవదానం అనే వ్యక్తి పరిచయమవుతాడు. ఆయనతో కలిసి కుల నిర్మూలన సంఘంలో పనిచేస్తాడు. తమ ఊర్లలోని రాజకీయ వ్యవస్థ అర్థమవుతుంది. వీటన్నిటి నుంచి తన మూలాల వేర్లు తమ జాతి జనుల మధ్యే ఉన్నట్లుగా కనువిప్పు కలుగుతుంది నాయకుడికి.
కడప జిల్లా గ్రామనామాలపై పి.హెచ్‌డీ
ఈయన రాసిన దష్టి, దీపదారులు, పరిచయం, సంగమం మొదలైన వ్యాస సంకలనాలు వెలువడినై. కడప జిల్లా గ్రామ నామాలపై పరిశోధన జరిపి పి.హెచ్‌డీ పట్టాను అందుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని విశాలాంధ్ర వారు 13 సంపుటాలుగా విశ్వనాథరెడ్డి సంపాదకత్వంలోనే వెలువరించారు. వీటికి ఎంతో విలువైన సంపాదకీయ పీఠికల్ని పొందుపరిచారు. ఇలాగే వీరి వ్యాసాలు, ఉప న్యాసాలు మొదలైన ప్రక్రియల రచనల్ని కూడా ఎంతో బాధ్యతగా రాశారు.
ఉద్యోగ విధులు
లెక్చరర్‌గా, ఆచార్యులుగా, సార్వ త్రిక విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్య క్షులుగా, డైరక్టర్‌గా పని చేశారు. శ్రీ వేంకటేశ్వర, తెలుగు, బెనారస్‌ మొదలైన విశ్వవిద్యాలయాల పాలక మండలి సభ్యులుగా, యుజీసీ, లాంగ్వేజ్‌ ప్యానల్‌ సభ్యులుగా ఉన్నారు. ‘మహిత’ సంస్థ గౌరవాధ్యక్షులుగా, టాటా ట్రస్ట్‌ సమన్వయ కర్తగా, గజ్జెల మల్లారెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా, వేమన ఫౌండేషన్‌ ఉపాధ్యక్షులుగా, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా… ఇలా ఎన్నో సంస్థల్లో కీలక పాత్ర నిర్వహించారు. కార్యకర్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘంకు వివిధ బాధ్యతలో పాటు అధ్యక్షులుగా కూడా పనిచేశారు.
సామాన్యుల కోసమే…
వీరి సాహిత్య కషికి గుర్తుగా తుమ్మల వెంకట రామయ్య బంగారు పతకం, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొదలైన ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఇలా కేతు విశ్వనాథరెడ్డి జీవితాన్ని సాహిత్యాన్ని గమనిస్తే తను ఏది చేసినా సామాన్యుల కోసమే చేశారు. సామాన్యంగా జీవించారు. మనలో స్ఫూర్తినింపారు.

– డా. రాపోలు సుదర్శన్‌, 9441779688
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అరసం

Spread the love