సిట్సిపాస్‌ నిష్క్రమణ

– ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌
ఇండియన్‌ వెల్స్‌ : గ్రీసు స్టార్‌ ఆటగాడు, రెండో సీడ్‌ స్టెఫానో సిట్సిపాస్‌కు చుక్కెదురైంది. ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ రెండో రౌండ్లోనే స్టార్‌ ఆటగాడికి పరాజయం ఎదురైంది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఆస్ట్రేలియా ఆటగాడు జోర్డాన్‌ థామ్సన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడు సెట్ల పోరులో 6-7(0-7), 6-4, 6-7(5-7)తో సిట్సిపాస్‌ పోరాడి ఓడాడు. టైబ్రేకర్‌కు దారితీసిన ఉత్కంఠ మ్యాచ్‌లో కంగారూ ఆటగాడు పైచేయి సాధించాడు. తొలి, నిర్ణయాత్మక మూడో సెట్లను టైబ్రేకర్‌లో చేజార్చుకున్న సిట్సిపాస్‌.. రెండోసెట్‌ను సులువుగా దక్కించుకునా ఫలితం లేదు. ఐదో సీడ్‌, రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదేవ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. అమెరికా ఆటగాడు బ్రాండన్‌ నకషిమాపై 6-4, 6-3తో వరుస సెట్లలో మెద్వదేవ్‌ గెలుపొందాడు. ఆండీ రూబ్లెవ్‌ సైతం 6-4, 6-2తో జిరి లేహెక (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందాడు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 6-3, 6-1తో అర్జెంటీనా ఆటగాడు పెడ్రోపై అలవోక విజయం నమోదు చేశాడు. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్‌ రెండో రౌండ్‌లో గెలుపొందింది. స్పెయిన్‌ అమ్మాయి క్రిస్టినాపై 6-2, 6-4తో సులువుగా నెగ్గింది. రెండో సీడ్‌ సబలెంక 6-2, 6-0తో రోడినపై ఏకపక్ష విజయం సాధించింది. మూడో సీడ్‌ జెస్సికా పెగుల మూడు సెట్ల మ్యాచ్‌లో కామిలాపై పైచేయి సాధించింది. 3-6, 6-1, 6-2తో జెస్సికా మూడో రౌండ్‌కు చేరుకుంది. కరోలినా ప్లిస్కోవా 2-6, 6-0, 6-4తో అనా కలినకయపై, పెట్రా క్విటోవా 6-1, 7-5తో ఎలిజబెత్‌ మండిక్‌పై రెండో రౌండ్లో విజయాలు సాధించారు. మరియ సక్కరి 2-6, 6-4, 6-0తో షెల్బీ రోజర్స్‌ను ఓడించింది. ఇక మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న జోడీ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఆసీస్‌ ఆటగాడు మాథ్యూతో కలిసి 7-5, 3-6, 10-6తో రఫేల్‌, డెవిడ్‌ జోడీలపై మూడో రౌండ్లో విజయం సాధించారు.

Spread the love