నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన.. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదులు వస్తున్నా.. తితిదే గత ఛైర్మన్, ఈవో పట్టించుకోలేదని విమర్శించారు. లడ్డూ కల్తీ గురించితెలిసి దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటమాడొద్దన్నారు.