నవతెలంగాణ – అమరావతి: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనన్నారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టి, 11 రోజులపాటు కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.