నవతెలంగాణ – చెన్నై: చెన్నై నగరంలో ఓ రైలు పట్టాలు తప్పింది. తిరువళ్లూరు వెళుతున్న ఈ రైలు బేసిన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఉదయం పట్టాలు తప్పింది. ఈ ఈఎంయూ రైలులో చివరి నుంచి రెండో కంపార్ట్ మెంట్ పక్కకి ఒరిగిపోయింది. ఇది లేడీస్ కంపార్టమెంట్. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి బయల్దేరిన 8 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈఎంయూ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ఇతర రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లోనే ఉన్నవారు, ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై ఆగిపోవడంతో హడలిపోయామని చెప్పారు. ఇక ఆ రైల్లో ప్రయాణించడానికి భయపడిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే రైలు దిగేసి వెంటనే బస్సెక్కి గమ్యస్థానానికి వెళ్లిపోయాడు.