నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లు ఆలస్యమవుతాయని తెలిపారు. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దుచేశారు. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నది. ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. 8.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుందని అధికారు చెప్పారు. దీంతోపాటు మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.