– సర్వం కోల్పోయి దీనావస్థలో గ్రామస్థులు
– మేమెట్లా బతికేదని కన్నీరు మున్నీరు
నవతెలంగాణ -భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి వరద తగ్గుముఖం పట్టినా.. ఆ గ్రామస్తులు ఇంకా భయంలోనే ఉన్నారు. నష్టపోయిన పంటలు, చనిపోయిన పశువులను చూసి గ్రామ జనం విలవిలలాడుతున్నారు. నడవడానికి వీలు లేకుండా రోడ్లు ఛిద్రమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న ఊరిని నీరు కబలించిన తీరు చూసిన ప్రతి ఒక్కరూ కంటితడి పెట్టుకుంటున్నారు. కొట్టుకుపోయిన వారి జాడ తెలియదు. సర్వం కోల్పోయి రోడ్డుపై నిలుచున్నారు. భవిష్యత్‌ను తలచుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న గ్రామస్తులను ఓదార్చే సాహసం కూడా చేయలేని స్థితి నెలకొంది. ఆ గ్రామంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్న పరిస్థితి.
బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన కుండపోత వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. మోరంచపల్లి గ్రామంలో 280 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 1500 మంది ఉన్నారు. వారంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పాడి పంటలతోనే అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్ష బీభత్సానికి వాగులు, వంకలు గోదావరిని తలపించాయి. వరద నీటితో గ్రామాలు జలమయం అయ్యాయి. పలు చెరువు కట్టలు తెగిపోయి మోరంచపల్లి గ్రామం పూర్తిగా వరదనీటితో నిండిపోయింది. నలుగురు వరదనీటిలో కొట్టుకుపోగా ఇంకా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అలాగే గణపసముద్రం చెరువు, గణపురం మండలంలోని చెరువులు గురువారం తెల్లవారు జామున మత్తడి పడగా వరద నీరంతా మోరంచవాగులో కలిసింది. మోరంచ పల్లె వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పుతో వరద నీరు ప్రవహించింది. గమనించిన గ్రామస్తులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగడి సరోజన, గడ్డం మహాలక్ష్మీ వరద నీటిలో కొట్టుకుపోయారు. గ్రామంలోని 280 ఇండ్లలోని సుమారు వెయ్యిమంది భవనాలపైకి, సజ్జలు ఎక్కి వర్షానికి తడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఉదయం సహాయక చర్యలతో సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వారి కన్నీటి వేదన తీరకుండా ఉంది. గ్రామంలో మొత్తం వంద పశువులు కొట్టుకుపోగా పాకలో కట్టేసిన సుమారు 159 గేదెలు నాలుగు ఎడ్లు, వందల కొద్ది కోళ్లు మృత్యువాతపడ్డాయి.
దాదాపు 12 గంటలకు పైగా..
బుధవారం తెల్లవారుజాము నుండి వచ్చిన వరదలు దాదాపు 12 గంటలకు పైగా గ్రామాన్ని ముంచెత్తాయి. తగ్గు ముఖం పట్టిన తరువాత గమనిస్తే గ్రామస్థుల ఇండ్లలో మిగిలింది వరద బురదే తప్ప మరేమి లేదు. బియ్యం, దుస్తులు, ధాన్యం, విత్తనాలు, ఎరువులు, బంగారం ఇలా అన్నింటిని ఊడ్చేసుకుని పోయాయి వరదలు. అన్ని పోయాయి… మేముండి ఏం చేస్తామంటూ ఆ పల్లె జనం పెడుతున్న కన్నీరు.. ప్రతి గుండెను కదిలిస్తోంది. కొంతమందికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. వరద మిగిల్చిన విషాదపు ఆనవాళ్లను తొలగించుకోవాలంటే రోజుల తరబడి శ్రమించక తప్పని పరిస్థితి నెలకొంది.
మహిళల ఆర్తనాదాలు.. ఆవేదనలు
గ్రామంలోని మహిళల పరిస్థితి అయితే మరీ దయ నీయంగా మారిపోయింది. ప్రకృతి బీభత్సం వల్ల కలిగిన నష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపస్తున్నారు. శుక్రవారం గ్రామ స్థితిగతులను పరిశీలిం చేందుకు ఎవరు వెళ్లినా చేతులు పట్టుకుని విలపిస్తున్న గ్రామ మహిళలను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
కొట్టుకుపోయిన జాతీయ రహదారి
మోరంచపల్లి వాగు వరద ఉధృతిలో జాతీయ రహదారిపై వేసిన వంతెన కూడా కొట్టుకుపోయింది. కొంత భాగం రోడ్డు కూడా దెబ్బతిన్నది. దాంతో భూపాలపల్లి, పరకాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నప్పటికీ భారీ వాహనాలు మాత్రం వెంటనే నడిచే అవకాశం కనిపించడం లేదు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టినప్పటికీ ఇంకా పూర్తి కాలేదు.
ప్రాణాలతో బయటపడ్డాం :జూలకంటి రాధమ్మ
గాఢ నిద్రలో ఉన్నాం.. తెల్లవారుజామున ఇంటి ఎదురుగా నివాసం ఉండే రాజు అనే పిల్లవాడు అమ్మ.. అమ్మ.. అంటూ పిలవగానే మెలకువ వచ్చింది. వరదొస్తుంది బయటికి రండి బయటికి రండి అంటూ అరుస్తున్నాడు. అప్పుడు తలుపు తీసేందుకు ప్రయత్నిస్తుంటే వరద లోపలికి వచ్చి తలుపులు రాలేదు. అప్పటికే మమ్మల్ని పిలిచిన రాజు మీతో ఉంటే నేను కూడా మునిగిపోతాను అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దిక్కుతోచని స్థితిలో తలుపులు తీసుకొని నా కొడుకు, నేను గోడ పట్టుకొని బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాం. కానీ అన్ని కోల్పోయిన మాకు ఎలా బతకాలో అర్థం కావడం లేదు అంటూ బోరున విలపించింది.
కిరాణా సామాను తడిసిపోయింది..సర్వం కోల్పోయాం..
దొడ్డ ప్రేమలీల రామచందర్ రెడ్డి
గ్రామంలో చిన్న కిరాణం షాపు పెట్టుకొని బతుకుతున్నాం. తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఇండ్లకు నీరు రావడంతో లేచి చూసేసరికి ఇల్లంతా వరద నీరు చేరింది. ఏమి చేయాలో తోచక నా భర్త, నేను బిక్కుబిక్కుమంటూ భయపడ్డాం. పక్కింటి వారు పిలవడంతో ఇంటి వెనకాల ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళగా వారు అటు నుంచి చీర వేసి మమ్మల్ని బయటికి లాగారు. ఇంట్లో ఉన్న ధాన్యం బియ్యంతో పాటు, కిరాణా సామానుతో మొత్తం ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది.
వరద తగ్గుముఖం
– రామన్నగూడెం వద్ద
– కొనసాగుతున్న గోదావరి వరద
– ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా
– ఆహారపొట్లాల పంపిణీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం వర్షం కురవకపోవడంతో వరంగల్, హన్మకొండ నగర వాసులు ఊపిరిపీల్చుకున్నారు. ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గలేదు. 16.23 మీటర్ల మేరకు గోదావరిలో వరద వుంది. ముడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరదలో చిక్కుకున్న కొండాయి, మల్యాల గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. ఈ గ్రామాలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 250 మందిని చిన్నబోయినిపల్లికి తరలించి పునరావాసం కల్పించారు. ములుగు జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో 70 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవడం తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడటంతో అటవీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడికి తరలించారు. ములుగు జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఆయా గ్రామస్తులను 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తరలించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అన్ని రకాలుగా నష్టపోయిన వారికి రూ.25 వేల ఆర్ధిక సాయం అందచేయాలని నిర్ణయించింది. ముంపుకు గురైన ప్రాంతాలను శుక్రవారం రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, స్పెషలాఫీసర్ కృష్ణ ఆదిత్య, గౌతమ్ సందర్శించారు. భూపాలపల్లి జిల్లా కర్కపల్లి, మోరంచపల్లి గ్రామాలను మంత్రి సత్యవతి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు.
వరదముంపులోనే వరంగల్ కాలనీలు
వరంగల్ నగరంలో బిఆర్‌నగర్ వరదముంపుకు గురైంది. ఆ కాలనీలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి అది óకారులు తరలించారు. వరంగల్ ఉర్సులోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ, మెడికేర్ ఆసుపత్రిలోకి వరద చేరడంతో సిబ్బందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. హన్మకొండలోని కాకతీయ కాలనీ, యాదవనగర్ వరద ముంపుకు గురయ్యాయి. ఈ కాలనీలలో 24 గంటలు కరెంటు లేక కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధరామరెడ్డి నార్లాపూర్ గ్రామాన్ని సందర్శించి ఎవరూ అధైర్య పడొద్దని,తాను అండగా వుంటానని భరోసా ఇచ్చారు
భారీ వర్షాలతో రూ.20 కోట్ల నష్టం
భారీ వర్షాలతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో 20 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సిఎండి ఎ. గోపాల్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. హన్మకొండలో భారీ వర్షాలకు నీటమునిగిన గోపాల్‌పూర్ తదితర సబ్‌స్టేషన్‌లను సిఎండి శుక్రవారం సందర్శించారు. కాకతీయ కాలనీలో తెగిపడిన లైన్‌లను పరిశీలించారు. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలతో వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వందలాది కిలోమీటర్ల లైన్‌లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరు స్పెషలాఫీసర్లను నియమించి త్వరితగతిన పనులు పూర్తి చేసి విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించినట్టు చెప్పారు.
– సీఎండీ ఎ గోపాల్‌రావు