– గుర్తు తెలియని వ్యక్తులు కూల్చినట్టు పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ-హాయత్ నగర్
‘కిన్నెర మొగులయ్య’గా పేరుగాంచిన ప్రముఖ జానపద కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలంలో మొగులయ్య నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. వివరాల్లోకెళ్తే.. మొగులయ్య తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి చేసిన సేవలకు గుర్తింపుగాను మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం హయత్‌నగర్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ ఇంటి స్థలం ధ్రువపత్రాలను మొగులయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అందజేశారు. దాంతో ఆ స్థలంలో ఆయన కాంపౌండ్ వాల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొందరు దుండగులు గురువారం రాత్రి ఆ కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు. ఈ విషయంపై మొగులయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మొగులయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పి.నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్లాట్‌కు సంబంధించిన భూమి వివాదం లేదని, ప్రహరీ కూల్చివేతపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.