ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టాల్సిందే !

నవతెలంగాణ – న్యూఢిల్లీ : తక్షణమే ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే అందచేయాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బిఐని ఆదేశించాలని 80మంది రిటైర్డు ఐఎఎస్‌ అధికారులు ఎన్నికల సంఘాన్ని కోరారు. వారు శనివారం నాడిక్కడ ఈ మేరకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఎస్‌బిఐ ఈ సమాచారాన్నంతా అందచే సేంతవరకు 2024 సార్వత్రిక ఎన్నికలషెడ్యూల్‌ను ప్రకటించరాదని వారు ఆ లేఖలో కోరారు. సుప్రీం ఇచ్చిన గడువును ఎస్‌బిఐ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ లేఖ వెలువడింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, మార్చి6వ తేదీ కల్లా ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని సుప్రీం ఆదేశించగా, ఈ గడువు ముగియడానికి ఒక రోజు ముందు అంటే ఎన్నికల బాండ్లను రద్దు చేసిన 17రోజుల తర్వాత ఎస్‌బిఐ తమకు జూన్‌ 30వరకు గడువు కావాలంటూ సుప్రీం కోర్టుకు దరఖాస్తు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని వారు వ్యాఖ్యానించారు.ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఐఎఎస్‌ (రిటైర్డ్‌) అనితా అగ్నిహోత్రి, సామాజిక న్యాయం, సాధికారతా శాఖ మాజీ కార్యదర్శి జి.బాలచంద్రన్‌, పశ్చిమ బెంగాల్‌ మాజీ అదనపు చీఫ్‌ సెక్రటరీ గోపాలన్‌ బాలగోపాల్‌, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి రాణా బెనర్జీ తదితరులు ఆ లేఖపై సంతకాలు చేశారు. 48కోట్ల ఖాతాలు కలిగిన, ఉన్నత స్థాయిలో డిజిటలైజేషన్‌ జరిగిన, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బిఐ, రికార్డులు రాతపూర్వ కంగా భద్రపరిచామనే పేలవమైన సాకు చూపి గడువు పొడిగించమని కోరడం హాస్యాస్పదంగా ఉందని ఆ లేఖలో వారు వ్యాఖ్యానించారు. అసలు ఈ మొత్తం ప్రక్రియకు పది నిముషాల కన్నా ఎక్కువ పట్టదని థామస్‌ ఫ్రాంకో , మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్‌ గార్గ్‌ వంటి బ్యాంకింగ్‌ రంగ నిపుణులే చెప్పారని అన్నారు.
ఈ లేఖ రాసిన మాజీ అత్యున్నత సివిల్‌ సర్వెంట్లు కానిస్టిట్యూషనల్‌ కండక్ట్‌ గ్రూప్‌ (సిసిజి)లో భాగంగా ఉన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగాలేమని, నిష్పాక్షికత, తటస్థత పట్ల నమ్మకం, భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగినవారమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోగా తాము సమాచారం అందించలేమని ఎస్‌బిఐ చెప్పడం చూస్తుంటే అధికారంలో వున్న ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్‌బిఐ ఒక కవచంలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాండ్లు ఇచ్చినవారికి, తీసుకున్నవారికి మధ్య క్విడ్‌ ప్రోకో (నీకిది నాకది) భాగోతం నడిచిందని, కొన్ని సార్లు తమకు అనుకూలంగా లేని కార్పొరేట్లపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సంస్థలతో దాడులు, బెదిరింపులకు దిగారని, పేర్కొంది. విరాళాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం చేసి పెట్టిన పనుల వివరాలు కూడా బయటకు రావాలని వారు కోరారు. రాజ్యాంగంలోని 324వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించడం ద్వారా తన పేరు ప్రతిష్టలను, సమగ్రతను ఎన్నికల్‌ కమిషన్‌ తిరిగి నిలబెట్టుకోవాలని అందుకు ఇదొక అవకాశమని ఎన్నికల కమిషన్‌కు వారు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Spread the love