– పోలీసులకు స్వేచ్ఛనిచ్చి వాళ్లను పనిచేసుకోనివ్వాలి
– తమపైకి.. అశోక్ నగర్‌లో పిల్లలపైకి పోలీసులను ఉసికొల్పొద్దు
– వెంటనే హౌంమంత్రిని నియమించండి :బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
– బాగ్ అంబర్‌పేటలో హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్..
– లింగారెడ్డి దంపతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు. వారికి స్వేచ్ఛనిచ్చి వాళ్ల పని వాళ్లని చేసుకోనివ్వాలన్నారు. రాష్ట్రంలో వెంటనే హౌం మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట సాయిబాబానగర్ కాలనీలో ఇటీవల హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ పి.లింగారెడ్డి దంపతుల ఇంటికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డి, విజరు కుమార్ గౌడ్‌తో కలిసి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లింగారెడ్డి, ఊర్మిళ అనే వృద్ధ దంపతులను పట్టపగలు వారి ఇంటిపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశారన్నారు. లింగారెడ్డి ముగ్గురు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి సంఘటన జరగటంతో వారంతా షాక్‌లో ఉన్నారని తెలిపారు. తమ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి విషయాన్ని తన దృష్టికి తీసుకురావడంతో వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. జంట హత్యలకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి ప్రజల ముందుంచాలని కోరారు. ఈ జంట హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇన్‌స్పెక్టర్‌ను అడిగితే ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటూ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి అనుచరుడిని హత్య చేశారని అన్నారు. ఇక్కడ వృద్ధ జంటను హత్య చేశారని, దాంతో హైదరాబాద్‌లో ప్రజలు భయంతో ఉన్నారని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని నగర సీపీ, డీజీపీలను కోరుతున్నా నన్నారు. పోలీసు అధికారులను తమ పైకి.. అశోక్ నగర్‌లో పిల్లల పైకి ఉసికొల్పకుండా శాంతిభద్రతలు కల్పించాల న్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. సరైన విధంగా శాంతిభద్రతలు మెయింటెన్ చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందని తెలిపారు. అది చేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవరి మీద కేసులు పెట్టించాలా? ఎవరెంబడి ఎట్ల పడాలా? ఎవరిని ఎట్లా వేధించాలా? ఇది మాత్రమే ఎజెండాగా పెట్టుకొంటే శాంతిభద్రతలు ఖచ్చితంగా దెబ్బతింటాయని అన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు దెబ్బతిన్నాయని, వాటిని బాగుచేయిస్తానని తమ ఎమ్మెల్యే ముందుకు వచ్చారని తెలిపారు. తాము పది లక్షల సీసీ కెమెరాలు నగరంలో ఏర్పాటు చేశామని, అవి పనిచేయకపోతే ప్రభుత్వం బాగుచేయించాలని, ప్రభుత్వం పట్టించుకోకపోతే తాము వాటికి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముఠా జయసింహ, డాక్టర్ శిరీష ఓం ప్రకాష్ యాదవ్,, డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్,సిద్ధార్థ ముదిరాజ్,ఎర్ర భీష్మ దేవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.