దిగజారుతున్న రైతుల ఆర్థిక పరిస్థితి

దిగజారుతున్న రైతుల ఆర్థిక పరిస్థితి– ప్రభుత్వాలవి మాటలే.. చేతలు శూన్యం : మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-వైరాటౌన్‌
దేశంలో రోజురోజుకూ రైతుల పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతోందని మాజీ శాసనసభ్యులు, రైతు సంఘం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం బోడేపూడి వెంకటేశ్వరరావు 27వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా వైరామండల కేంద్రంలో మల్లెంపాటి రామారావు అధ్యక్షతన జరిగిన స్మారకోపన్యాసంలో నంద్యాల నరసింహారెడ్డి ”రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కారం మార్గాలు” అంశంపై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలపై చట్టబద్ధత కల్పించడం లేదన్నారు. దేశంలో ఆహార స్వయం సమృద్ధి కోసం అనేక ప్రణాళికలు అమలు చేశారని, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాల అమలు వల్ల కొన్ని రకాల పంటల సాగు గణనీయంగా తగ్గిందని చెప్పారు. లక్షల టన్నుల పప్పుధాన్యాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో మనమున్నామని, దేశంలో చిరుధాన్యాలు తృణధాన్యాలు, ఆయిల్‌ పంటలకు సరైన ధరలు కల్పించి ప్రభుత్వం మద్దతుగా ఉంటే విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఏం ఉంటుందని ప్రశ్నించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బోడేపూడి వెంకటేశ్వరరావుతో రైతు ఉద్యమాల్లో, శాసనసభలో కలిసి పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేసుకున్నారు. నిరంతరం ప్రజలు, రైతుల కోసం పరితపించిన రైతు బాంధవుడు బోడేపూడి అని కొనియాడారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందించే సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సంస్థల అభ్యంతరాలను పరిష్కారం చేయాలన్నారు. ఆగస్టు 13న గోదావరి రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ సమావేశం నాటికి ఉభయ రాష్ట్రాల మధ్య చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా ముందుకు సాగాలని అన్నారు. సీతారామ ప్రాజెక్టును పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే ప్రధాన కాలువల పనులు తిరిగి మొదలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీతారామ ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువల నుంచి వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం నేరుగా చేయాలని కోరారు. రుణమాఫీలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నా ప్రభుత్వం పరిష్కారం చేయకుండా ఆగస్టు 15 తర్వాత అంటూ దాటవేత ధోరణి అనుసరించడం సరికాదన్నారు.కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, శీలం పకీరమ్మ, సీఐటీయు జిల్లా నాయకులు సుంకర సుధాకర్‌, తోట నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, నాయకులు వనమా చిన్న సత్యనారాయణ, బాణాల శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, సైన్స్‌ ఉద్యమ నాయకులు మల్లెంపాటి వీరభద్రం, ఠాగూర్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ సంక్రాంతి రవి పాల్గొన్నారు.

Spread the love