మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి..

– భక్తులకు సులభంగా, వేగంగా దర్శనం కల్పించాలి..
– ఆర్కిటెక్ ను నియమించాలి..
– వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పై సమీక్ష..
– సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..
– హాజరైన మంత్రి పొన్నం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణకే తలమానికంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రం లోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతి పై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి, ఆయా శాఖల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి గురువారం సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్టి నియమించి పక్కా ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.  ఆలయానికి ఇప్పటికే కేటాయించిన 50 కోట్లతో  శృంగేరి పీఠం వారి అనుమతి పూర్తి అయిన సందర్భంగా పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఆలయ పనులు పూర్తయిన తర్వాత బ్యాంకు లాకర్ లో ఉన్న బంగారంతో రాజన్న ఆలయాన్ని బంగారం తాపడంతో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. రాజన్న సన్నిధిలో కార్తీక మాసం సందర్భంలో ప్రతీ సోమవారం కోటీ దీపోత్సవం నిర్వహించెల చూడాలని పేర్కొన్నారు.
చేనేత శాలువాలు బ్యాగులు వాడేలా చూడాలి
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కు వారి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, వేములవాడ దేవాలయ ఈవో వినోద్, ఆయా ఆలయాల ఈఓ లు స్థపతి ఎన్. వల్లి నాయగన్, ఎస్ఈ కె. దుర్గా ప్రసాద్, సహాయ స్థపతి పి. గణేషన్, కన్సర్వేష ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్, శరత్, ఈఈ రాజేష్, డి ఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love