దేవాలయాలు, విద్యాలయాల అభివృద్ధి, శాంతిభద్రతలకు ప్రాధాన్యం

త్వరలోనే మల్కపేట జలాశయాన్ని ప్రారంభిస్తాం : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ – సిరిసిల్ల
రాష్ట్రంలో విద్యాలయాలను ఎంత అభివృద్ధి చేస్తున్నామో దేవాలయాలను, పోలీసింగ్‌, శాంతి భద్రత వ్యవస్థను కూడా అదే పద్ధతిలో అభివృద్ధి చేస్తూ ప్రజలకు చేరువ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పున్ణనిర్మాణ పనులకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం సిరిసిల్ల జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 80సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. టీటీడీ ఆర్థిక సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలకు పూర్వ వైభవం తేవచ్చని రిక్వెస్ట్‌ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఫలితంగా ఇప్పుడు సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గంభీరావు పేటలో కేజీ టూ పీజీ క్యాంపస్‌ను అభివృద్ధి చేసిన మాదిరిగానే తెలంగాణలోని 26వేల ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. మండు వేసవిలో చెరువులు, కుంటలు, నదులు జలకళను సంతరించుకున్నాయని, సీఎం కేసీఆర్‌ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమైదన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలతో పాటు బ్రాహ్మణ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అణగారినవర్గాలనే కాదు అగ్రవర్ణ పేదలను కూడా ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటుందని స్పష్టం చేశారు.
20రోజుల్లో మల్కపేట జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మల్కపేట జలాశయంతో ఎల్లారెడ్డిపేట శాశ్వతంగా సస్యశ్యామలం అవుతుందన్నారు. దేశ జనాభాలో 3శాతం జనాభా కలిగిన తెలంగాణ.. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందించే జాతీయ అవార్డుల్లో 30శాతం సాధించిందన్నారు. పట్టణాలు కూడా అదే బాటలో నడుస్తూ 25 అవార్డులు అందుకున్నాయని తెలిపారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో ఆలయాల పున్ణ నిర్మాణానికి సహకరించిన టీటీడీ గంభీరావుపేట సీతారామ ఆలయం పున్ణ నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరగా టీటీడీ చైర్మెన్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. టీటీడీ చైర్మెన్‌ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు ఉండేచోట పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు.
కరీంనగర్‌లో రూ.20కోట్లతో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రూపురేఖలు మారాయని కొనియాడారు.

Spread the love