స్వరాష్ట్రంలోనె దేవాలయాల అభివృద్ధి..

– సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు పండుగలు
– హుస్నాబాద్‌ శాసనసభ్యులు వొడితల సతీష్‌ కుమార్‌
నవతెలంగాణ-కోహెడ : స్వరాష్ట్ర సాధనలోనె దేవాలయాల అభివృద్ధి జరిగిందని హుస్నాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో గత 10 రోజులుగా జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో భాగంగా బీరప్ప కామరాజు కళ్యాణం డప్పు చప్పుళ్ళు భాజా భజంత్రీలు ఒగ్గు పూజారులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, నిర్వాహకులు ఎమ్మెల్యేను డప్పుచప్పుల్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ పండుగలు మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. బంధువులు, సహచరులతో పండుగ జరుపుకోవడం ప్రతి ఒక్కరూ ఆనందించే విషయమన్నారు. అనాదిగా భక్తిశ్రద్ధలతో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలందరూ బాగుండాలని అలాగే పాడి పంటలతో గ్రామం సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ పల్లెలన్నీ అభివృద్ధికి చిరునామాలుగా మారి ఆచారాలు, సాంప్రదాయాలు పాటించుకుంటూ ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ కలలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒగ్గుడోలు కళాకారుల బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవ చరిత్రను కథ రూపంలో భక్తులకు వివరించారు. కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పాము నాగేశ్వరి శ్రీకాంత్‌, కురుమ కుల బాంధవులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love