స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గోల్కొండ కోటలో ఆగష్టు 15న నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం డీజీపీ అంజనీకుమార్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆరోజు ఉదయం సికింద్రాబాద్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, 11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌, అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ అరవింద్‌ సింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ ఎండి మనోహర్‌, టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్శకుల కోసం 14 ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. లైవ్‌ కవరేజ్‌ కోసం 10 కెమెరా యూనిట్లు, లైవ్‌ కవరేజ్‌ లింకింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు వచ్చిన ముఖ్య అతిధులు, అధికారులు, సందర్శకులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని 582 సినిమా స్క్రీన్లలో ‘గాంధీ’ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ అశోక్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు, 16 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. అయితే 15, 20 తేదీల్లో ఈ చిత్ర ప్రదర్శనలు ఉండబోవన్నారు. విద్యార్ధులు, సాధరణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, గాంధీ చిత్రాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love