ఉచిత’ పథకాలపై ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు..

నవవంగాణ – ఢిల్లీ: ప్రస్తుత సమాజంలో ‘ఉచిత’ పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేయడం వ్యయ ప్రాధాన్యతలను మార్చుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. జేబులకు భరోసా ఇవ్వడం కాదని.. ప్రజలను శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దీర్ఘకాలంలో దీని ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. భారత్‌ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ‘మానవ హక్కుల్లో ప్రపంచంలో ఏ భాగం కూడా భారత్‌ మాదిరిగా విరాజిల్లడం లేదు. మన నాగరికత, రాజ్యాంగ రూపకల్పన అనేవి మానవ హక్కులను గౌరవించడం, పరిరక్షించడం, పెంపొందించడంలో మన నిబద్ధతను చాటిచెబుతున్నాయి. ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది’ అని భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లో పోటాపోటీగా చూస్తున్న ఉచితాలపై ఉపరాష్ట్రపతి స్పందించారు. ‘జేబులకు భరోసా ఇవ్వడం అనేది ఆర్థికంగా ఆధారపడటాన్ని పెంచుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్న ఉచిత రాజకీయాలు కేవలం వ్యయ ప్రాధాన్యతలను వక్రీకరించడమే. దిగ్గజ ఆర్థిక నిపుణుల ప్రకారం, ఉచితాలు అనేవి స్థూల ఆర్థిక స్థిరత్వం ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తాయి’ అని ధన్‌ఖడ్‌ వెల్లడించారు. దీర్ఘకాలంలో జీవన ప్రమాణాలను మెరగుపరచడం, ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రోత్సాహం ఎంత భారం అనే విషయాలపై జాతీయ స్థాయిలో ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

Spread the love