నేడు వీరంగం వేస్తున్న సనాతన ధర్మ పరులందరూ మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నోళ్ళు విప్పనేలేదు. హర్యానా విధ్వంసం వారిని కదిలించలేదు. దళితులపై, ఆదివాసీలపై దాడులు వారికి కనిపించనే లేదు. ఒక రాష్ట్రంలో మూడు నెలలుగా మంటలు లేస్తుంటే మాటపెకలని నాయకులు, విభజన మతోన్మాద చిచ్చుకు వెంటనే ఆజ్యం పోస్తున్నారు. నిజమైన దైవారాధకులు, ధర్మాచరణులు సహనంతో కూడిన శాంతి కాముకులు. అశేష ప్రజానీకం శాంతి సమానత్వాల వైపే నిలుస్తారు. ఉన్మాదాలను నిర్మూలిస్తారు.
ఏది ధర్మం! ఏదధర్మం! ఓ మహాత్మా… అని తెలుసుకోవాల్సిన సందర్భం ముందుకొచ్చింది. అసలు ధర్మం అంటే, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్తివిధి, యజ్ఞము, విధి, ఆచారము, పుణ్యము అంటూ నిఘంటువులు సెలవిస్తున్నాయి. ఇక సనాతన ధర్మమంటే మారకుండా శాశ్వతంగా ఉండేదని, ప్రాచీనం నుండి ఆచరిస్తున్నదనీ దాని భావం. ఇప్పుడు గొడవంతా సనాతన ధర్మం చుట్టూ తిరుగుతున్నది. తమిళనాడు మంత్రి డి.ఎం.కె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు పురికొల్పాయి. చర్చవరకయితే ఫర్వాలేదు. ఏకంగా ఉదయనిధి తలకు వెలకట్టి, నరికి తెమ్మనేదాకా వెళ్ళింది. అంతేకాదు దీన్ని రాజకీయాలలోకి తెచ్చి ప్రయోజనాలను పొందాలనే కుటిల ప్రయత్నాలూ మొదలయ్యాయి. తాత్విక, నైతిక, సామాజిక, నీతి నియమాలపై చర్చలు, భిన్న అభిప్రాయాలు ఇప్పటివేమీకాదు. అనాదిగా ఉన్నవే. వాటిని ఆయా సందర్భాలను బట్టి వాదము, ప్రతివాదము కొనసాగాల్సిందే. చార్వాకులు, లోకయుతులు నుండీ ఉన్న సంప్రదాయమది. కానీ ఇప్పుడెందుకు ఇంతటి సహించలేనితనం! భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినవారిని హతమార్చేందుకే పిలుపునివ్వడం ఎంతటి అనాగరికం!
అసలు ఉదయనిధి అన్నదేమిటి! ”సమానత్వానికి, సామాజిక న్యాయానికి అడ్డుగా నిలుస్తున్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అని తమిళనాడు రచయితల సంఘం, ద్రవిడ కజగం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సనాతన ధర్మ నిర్మూలనా మహానాడులో ప్రసంగిస్తూ చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే మన రాజ్యాంగం సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించాలనే చెప్పింది. కానీ ఈ వ్యాఖ్యలను ఆసరా చేసుకుని మతతత్వాన్ని, విభజనను రెచ్చగొట్టేందుకు, దీన్ని హిందూ మతం మీద దాడిగా చిత్రీకరించటం వెనకాల ఉన్మాద చర్యలు దాగున్నాయి. ఒక వేళ హిందూ ధర్మంలోని దయినా మారకుండా ఉన్నది, ఆది నుండి ఉన్న ఆచారము నేటి ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థకు పనికిరాదనేది వాస్తవం.అసలు మారకుండా ఏదైనా ఉంటుందా? ప్రతిదీ మారుతుంది. ఏదీ స్థిరం కాదు. సనాతన ధర్మాలను పాటించడమూ అంటే, సామాజిక మార్పులను, ఆధునిక భావనలను తిరస్కరించడమనే అర్థం. పురాతనమైనవి, నేటి పరిస్థితులకు సరిపోనివి ఎన్నో ధర్మాలను ప్రతి మతమూ తొలగించుకోవటం చరిత్రలో మనం చూస్తాము. హిందూ మతము కూడా అనేక మార్పులకు గురయిందని అంబేద్కర్ చెబుతారు. యజ్ఞయాగాదుల్లో జంతువులను బలివ్వటాన్ని, హింసను వ్యతిరేకించి బుద్ధుడు అహింసను ముందుకు తెచ్చాడనీ, అలా ఎన్నో మార్పులకు గురవుతూ వచ్చిందని వివరిస్తాడు.
అయితే సనాతనము అనే అంశంలో వేదము, ఉపనిషత్, మనుస్మృతి ప్రామాణికమైన ధర్మాలని చెబుతుండటాన్ని చూస్తే అది బ్రహ్మసృష్టి అని విధిగా పాటించాలని ఘోషిస్తారు. ముఖ్యంగా మనుధర్మాన్ని భుజాన వేసుకోవటమే సనాతన ధర్మంలోని ప్రధానాంశం. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలను హీనంగా చూడటాన్ని మనం త్యజించాల్సిందే కదా! ”పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, పుత్రస్తు స్థావిర్భావే నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అన్న ధర్మం అధర్మ ధర్మమే కదానేడు! భర్త చనిపోతే అతనితో పాటు భార్యనూ తగలేసే సతీసహగమనం సనాతన ధర్మమైతే నిర్మూలించుకున్నాము కదా! ఇక ప్రధాన సమస్య బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవ చేసేందుకే శూద్రవర్ణం ఉందని, వారికి చదువును నిషేధించిన ధర్మం నశించవలసిందే! నిర్మూలించవలసిందే కదా! దేవదాసి, జోగినీ, బానిస వ్యవస్థలను నిర్మూలించడం కోసం ప్రభుత్వాలే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ సనాతనమైనవే! అంబేద్కర్ మహాశయుడు కుల నిర్మూలన కోసం జీవితమంతా కృషి చేశాడు. ఇప్పటికీ ఈ రక్కసి మనల్ని పట్టి పీడిస్తున్నది. మొన్న రంగారెడ్డి జిల్లాలో ఊరి బొడ్రాయి దగ్గర దళితులు వేడుక చేసుకుంటే అంటరాని వాళ్లు గుడివద్దకు రావొద్దని దాడిచేసి కొట్టటం సనాతన ధర్మంలో భాగమైతే నిజంగా తక్షణం నిర్మూలించాల్సిందే!
ఉదయనిధి స్టాలిన్ మాటలపై విరుచుకుపడే పెద్దలు, సన్యాసులు, మత ప్రవచనకారులు పై ఆచారాలేవీ సనాతన ధర్మంలో లేవని వాటికి మేం వ్యతిరేకమని ప్రకటించాలి. మనుధర్మంలోని మనుషుల విభజన, స్త్రీలపైన వివక్షత సనాతన ధర్మ సమ్మతం కాదని చెప్పగలగాలి! లేదా సనాతన ధర్మంలోని మంచి నేటి సమాజానికి ఎలా ప్రయోజనకారో వివరించాలి. అదేమీ లేకుండా తలలు తీసేయమని తాలిబన్ ఉగ్రవాదుల్లా మాట్లాడటం మూర్ఖత్వమే. ఉదయనిధి పరుషవ్యాఖ్యలపై ఆగ్రహమా! అసలు విషయంపైనే వ్యతిరేకమా! స్పష్టపరచాలి.
నేడు వీరంగం వేస్తున్న సనాతన ధర్మ పరులందరూ మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నోళ్ళు విప్పనేలేదు. హర్యానా విధ్వంసం వారిని కదిలించలేదు. దళితులపై, ఆదివాసీలపై దాడులు వారికి కనిపించనే లేదు. ఒక రాష్ట్రంలో మూడు నెలలుగా మంటలు లేస్తుంటే మాటపెకలని నాయకులు, విభజన మతోన్మాద చిచ్చుకు వెంటనే ఆజ్యం పోస్తున్నారు. నిజమైన దైవారాధకులు, ధర్మాచరణులు సహనంతో కూడిన శాంతి కాముకులు. అశేష ప్రజానీకం శాంతి సమానత్వాల వైపే నిలుస్తారు. ఉన్మాదాలను నిర్మూలిస్తారు.