అవిశ్రాంత పోరాట యోధుడు ధర్మబిక్షం

Dharmabiksham is a tireless fighter– ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అణగారిన వర్గాల్లో చైతన్యం రగిలించిన అవిశ్రాంత పోరాట యోధుడు బొమ్మగాని ధర్మబిక్షం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సమసమాజమే లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. ధర్మబిక్షం 103వ జయంతి వేడుకలు శనివారం హైదరాబాద్‌లో మఖ్దూంభవన్‌లో నిర్వహించారు. ధర్మబిక్షం చిత్రపటానికి కూనంనేని సహా పలువురు నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మబిక్షం అంటేనే సమరశీల ఉద్యమాలకు ప్రతీక అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన కీలక భూమిక పోషించారని చెప్పారు. కులాల పేరుతో కాకుండా చేతివృత్తిదారులైన బీసీ, ఎస్సీ అణగారిన వర్గాల్లో చైతన్యం పెంపొందించి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మబిక్షం ఒక వ్యక్తి కాదనీ, ఒక సంస్థ అని చెప్పారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజానేతగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నారని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారని వివరించారు. గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, ఐప్పో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్‌, తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి సాయిలుగౌడ్‌, రాష్ట్ర సమన్వయ అధ్యక్షులు నాగభూషణం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన, ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్‌ తదితరులు హాజరయ్యారు.

Spread the love