17న గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ధర్నా

నవతెలంగాణ – సిద్దిపేట 
గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, బదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, అన్ని సొసైటీల్లోనూ ఏకరూప పరిపాలన అమలు, రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలకూ స్వంత భవనాలు నిర్మించాలనే తదితర సమస్యల సాధనకై తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఈనెల 17న  సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు  టీఎస్ యూటీఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి  యాదగిరి తెలిపారు. శుక్రవారం  ధర్నాను విజయవంతం చేయాలని ధర్నాకు సంబంధించిన కరపత్రాలను వివిధ గురుకుల పాఠశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు విజయవంతమైన నమూనాగా ఉన్నాయని అన్నారు. గురుకుల విద్యార్థులు సాధించిన విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ, అంకితభావం అంతర్లీనంగా ఉందన్నారు. వారి శ్రమను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన గురుకులాలకు వెంటనే శాశ్వత భవనాలను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల మెస్‌ చార్జీలు 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వెంటనే ఉత్తర్వులివ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలే మార్గమని అన్నారు. గురుకుల ఉపాధ్యాయులు పాఠ్యబోధనతోపాటు హౌజ్‌ మాస్టర్‌, కేర్‌టేకర్‌, డిప్యూటీ వార్డెన్‌, సూపర్‌వైజరీ స్టడీస్‌, నైట్‌ స్టే, ఎస్కార్ట్‌ తదితర ఎన్నో విధులను నిర్వహిస్తున్నారని అన్నారు. 24×7 పనిచేస్తూ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పారు. అయినా ఉపాధ్యాయుల శ్రమకు తగిన వేతనం గానీ, కష్టానికి తగిన గుర్తింపుగానీ లభించటం లేదన్నారు. నిర్వహణలో ఏమాత్రం తేడావచ్చినా కఠిన శిక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శారీరక శ్రమతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. వారిపై బోధనేతర పనుల భారం తగ్గించాలని, స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒక్కో సొసైటీలో ఒక్కో రకంగా పరిపాలన, ఆజమాయిషీ కొనసాగుతున్నదన్నారు.  బోధనా సమయాల్లో సైతం ఏకరూపత లేదన్నారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటు సమాన సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, గెస్ట్‌, పార్ట్‌ టైం టీచర్లు పనిచేస్తున్నారని వివరించారు. వారికి కనీస వేతనాలు లభించటం లేదన్నారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే దశలవారీ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కృష్ణ, జిల్లా కార్యదర్శి కనకరాజు, శివలింగం, గిరిబాబు, సుప్రియ, కల్పన, శారదా, సంధ్య, కరుణాకర్, అనిల్ తదితరులు  పాల్గొన్నారు.
Spread the love