బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ జీఎం కార్యాలయం ఎదుట ధర్నానవతెలంగాణ-నస్పూర్‌
బొగ్గు గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వెలువడిన బొగ్గు నిక్షేపాలను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని గుర్తింపు కార్మిక సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు నిక్షేపాలను నామినేషన్‌ పద్ధతిలో ప్రభుత్వం సింగరేణి సంస్థకే కేటాయించాలన్నారు. గుజరాత్‌, ఝార్ఖాండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ఏ విధంగా నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ కూడా బొగ్గు నిక్షేపాలను వేలంపాట లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విదానలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రయివేటు పరం చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు కోల్పోవడంతోపాటు ప్రభుత్వ ఆధాయానికి గండి పడే అవకాశాలు ఉన్నాయన్నారు. లేని పక్షంలో గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో బొగ్గు నిక్షేపాలు సింగరేణి సంస్థకు కేటాయించేంతవరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామన్నారు. అనంతరం జనరల్‌ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా, ఏఐటీయూసీ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌ రావు, బ్రాంచ్‌ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, బ్రాంచ్‌ నాయకులు రాచర్ల చంద్రమోహన్‌, సంపత్‌, నాగభూషణం, ప్రసాద్‌రెడ్డి, అప్రోజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Spread the love