ప్రజాసమస్యల పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

ప్రజా సంఘాల వేదిక జిల్లా బాధ్యులు పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ అనితకు వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘాల వేదిక జిల్లా బాధ్యులు, మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల స్థలాలు, ఇండ్లు, ధరణిలో భూ సమస్యలు, అడవి హక్కు పత్రాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు మొదలగు సమస్యల పరిష్కారం చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టినట్టు చెప్పారు. గతంలో ఇండ్ల పట్టాలు పొందిన వారికి ఇండ్ల స్థలాల సరి హద్దులు నిర్ణయించాలనీ, ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు రాక ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరణిలో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పొడు భూములు సాగు చేస్తున్న రంగాపూర్‌, చీదేడ్‌, దాతపల్లి, జపాల, ఆరుట్ల గ్రామాలకు చెందిన అటవిహక్కుల పత్రాలు ఇవ్వాలన్నారు. బొడ కొండ, ఎల్లమ్మ తండా, వెంకటేశ్వర తండా గ్రామాల్లో 1921 ఎకరాల సీలింగ్‌ భూములను రద్దు చేసి నిజమైన కాస్తూ దారులకు పట్టాలు ఇచ్చి, ఉపాధి పెండింగ్‌ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కె. శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్యాంసుందర్‌, డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి సిలివేరు రాజు, వ్యకాస మండల అధ్యక్ష, కార్యదర్శులు కాళ్ళ జంగయ్య, ఆవుల యాదయ్య, మహిళా సంఘం మండల కార్యదర్శి రంగాపూర్‌ సర్పంచ్‌ డబ్బికార్‌ మమత అజరు బాస్‌, నాయకులు పి.గోపాల్‌, ఎం.బుగ్గ రాములు, వెంకటేష్‌, కె.జగదీష్‌, రవి, కె. బుచ్చయ్య, లెనిన్‌, యాదగిరి, చందునాయక్‌, శ్రీనివాస్‌, సుధాకర్‌ తదితరులున్నారు.

Spread the love