కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

– సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ ఉద్యమించాలి : వామపక్ష నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు గత 10 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఆందోళనకు వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు పేద ప్రజలకు సేవలందిస్తున్నారని, అయినా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ సౌకర్యాలను తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు కల్పిస్తున్నారని అన్నారు. మన పాలకులు పదేపదే తెలంగాణలోనే మెరుగైన జీతాలు ఇస్తున్నారని, గొప్పలు చెప్పుకుంటున్నారని, మన రాష్ట్రం కంటే ఎక్కువ సౌకర్యాలను ఇచ్చే, జీతాలు ఇచ్చే రాష్ట్రాల గురించి ఎందుకు ప్రస్తావించటం లేదని వారు ప్రశ్నించారు. వీరికి కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదన్నారు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని, మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని వారు గుర్తు చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఇచ్చారని, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, పండగ బోనస్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని, రాష్ట్రంలో కూడా అదేవిధంగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలూ అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదని అన్నారు. చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై సెంటర్లకి తాళాలు వేస్తామని, ఉద్యోగం నుండి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేయడం జిల్లా అధికారులకు తగదని, ఇలాంటి చర్యలు మాను కోకపోతే రాజకీయ పార్టీలతో గ్రామాల్లో సెంటర్ల రక్షణ దళాలని ఏర్పాటు చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, ఐసిడిఎస్‌ పీడీలకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌, వై.విక్రం, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాదె లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్‌ రామూర్తి, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దుగ్గి కృష్ణ, యూనియన్‌ జేఏసీ నాయకులు సిహెచ్‌ సీతామహాలక్ష్మి, బి.కోటేశ్వరి, కే.సుధా రాధా, కే.నాగమణి, దుగ్గి పాపారాని, బేబీ రాణి, నిర్మల, యూ పద్మ, జి.రమ, అచ్చమాంబా, చావా పద్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love