కలెక్టరేట్‌ ఎదుట డిగ్రీ విద్యార్థినుల ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట డిగ్రీ విద్యార్థినుల ధర్నా– ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌
– ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌తో ఆందోళన విరమణ
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ప్రిన్సిపాల్‌ ఎస్‌.దివ్యరాణిని సస్పెండ్‌ చేయాలంటూ కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా బూరుగూడ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం రోడ్డెక్కారు. కళాశాల నుంచి విద్యార్థినులు కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా చేరుకొని ధర్నా చేశారు. ప్రిన్సిపాల్‌ దివ్యరాణి తమను మానసికంగా వేధిస్తున్నారని, ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలకు వచ్చే ఆహార పదార్థాలను బయటకు తీసుకెళ్తున్నారని, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు తమకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బాత్రూమ్‌ల వద్ద నిలబెట్టడం, చెప్పుల వద్ద కూర్చోబెట్టి.. అన్నం తినమనడం లాంటివి చేస్తున్నారని ఏడుస్తూ చెప్పారు. నాణ్యమైన వస్తువులు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకే ధర్నా చేస్తున్నట్టు వివరించారు. విద్యార్థినులకు డీఆర్‌ఓ సురేష్‌, డిటిడిఓ రమాదేవి, డిఎస్‌పి వెంకటరమణ, పిటిజి ప్రిన్సిపాల్‌ సురేష్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో గిరిజన శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమనాథ్‌ శర్మతో పిటిజి ప్రిన్సిపాల్‌ సురేష్‌ ఫోన్‌లో మాట్లాడి విద్యార్థినులతో మాట్లాడించారు. ఐదుగురు విద్యార్థినుల బృందాన్ని అధికారులు కలెక్టర్‌ బోర్కడే హేమంత్‌ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి సమస్యలు వివరించారు. అప్పటికే అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమనాథ్‌ శర్మ ప్రిన్సిపాల్‌ దివ్యరాణిని సస్పెండ్‌ చేసినట్టు తెలియజేశారు. వారు బయటకు వచ్చి విద్యార్థినులతో జరిగిన విషయాన్ని చెప్పడంతో శాంతించారు.

Spread the love