నవతెలంగాణ- నసురుల్లాబాద్ (బాన్సువాడ)
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా,ఆందోళన నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ డివిజన్ పరిపాలన అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పాత బకాయి బిల్లును వెంటనే చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికులకు ౩ వేలు గౌరవ వేతనం చెల్లిస్తానని ఇచ్చిని హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంట కార్మికులకు బిల్లులను ప్రతి నెల 5వ తేదీ లోపు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వమే వంట సామాగ్రి మరియు నిత్యవసర సరుకులను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వంట కార్మికులకు రోజుకు 6 వందల రూపాయలు చెల్లిస్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని వారు సూచించారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుకూలంగా కోడిగుడ్డు, గ్యాస్ ఇతర నిత్యవసర వస్తువుల ధరలకు అనుకూలంగా మేస్ ఛార్జీలు పెంచి చెల్లించాలి. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ యొక్క పనిని బంద్ చేసుకొని సమ్మెలో కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలాబాయి, ముస్తఫా, బాల్రాజ్, శ్రీనివాస్, లలిత, సరిత, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.