నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. భువనగిరి మండలం సూరెపల్లి గ్రామ రైతులు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఒకవైపు అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతున్నాయని, అయినా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగడం లేదని, ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని తాళం వేసి ఒక్క ఉద్యోగస్తులను లోనికి ప్రవేశించ కుండా ముట్టడిస్తామని హెచ్చరించారు. సుమారు గంటకు పైగా ధర్నా నిర్వహించడం తో డిఎం గోపికృష్ణ అక్కడికి వచ్చి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూనూరు ఆంజనేయులు, బొడ్డు మైసయ్య, అనంతరెడ్డి, మాధవరెడ్డి లు పాల్గొన్నారు.